రాజమౌళి ఇంకా కథే చెప్పలేదు

రాజమౌళి ఇంకా కథే చెప్పలేదు

జూనియర్ ఎన్టీఆర్-రామ్ చరణ్ కాంబినేషన్లో మల్టీస్టారర్ మూవీని రాజమౌళి కన్ఫమ్ చేసి ఆరు నెలలు దాటుతోంది. ఈ మధ్యే అధికారికంగా కూడా ఈ విషయాన్ని ప్రకటించారు. ఇంకొన్ని నెలల్లోనే సినిమా సెట్స్ మీదికి వెళ్లబోతోంది. రాజమౌళి దాదాపు పది నెలల నుంచి ఈ సినిమా స్క్రిప్టు మీద పని చేస్తున్నాడు. కాబట్టి ఈ పాటికి కథంతా రెడీ అయిపోయి ఉంటుందని.. ఇద్దరు హీరోలకూ నరేషన్ కూడా ఇచ్చేసి ఉంటాడని అంతా అనుకున్నారు.

కానీ ఇప్పటిదాకా ఈ చిత్ర స్క్రిప్టే రెడీ కాలేదట. ఎన్టీఆర్ సంగతేమో కానీ.. రామ్ చరణ్‌కైతే ఇంకా రాజమౌళి కథ కూడా చెప్పలేదట. ‘రంగస్థలం’ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో చరణ్ ఈ విషయాన్ని వెల్లడించాడు.

ఎన్టీఆర్‌తో చేయబోయే మల్టీస్టారర్ మూవీ స్క్రిప్టు ఇంకా లాక్ కాలేదని.. ఇంకా దానిపై వర్క్ నడుస్తోందని చరణ్ చెప్పాడు. రాజమౌళి తనకు ఇంకా స్క్రిప్టు నరేషన్ ఇవ్వలేదని అన్నాడు. రాజమౌళి కథలు.. క్యారెక్టరైజేషన్లు చాలా బలంగా ఉంటాయని.. ఆటోమేటిగ్గా కథ బాగుంటుందనేది తన నమ్మకమని చరణ్ చెప్పాడు. నిజానికి కథ లైన్ కూడా తెలియకుండానే ఈ సినిమా ఒప్పుకున్నానని.. ఈ చిత్ర కాంబినేషన్ కూడా తనకంత నచ్చిందని చరణ్ చెప్పాడు.

చరణ్, ఎన్టీఆర్ ప్రస్తుతం వేరే ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో స్క్రిప్టు విషయంలో రాజమౌళి హడావుడి పడాల్సిన అవసరం లేనట్లే. ఇంకో రెండు మూడు నెలల వరకు సమయం ఉన్నట్లే. స్క్రిప్టు లాక్ అయ్యాక ప్రి ప్రొడక్షన్ డిజైన్ చేసుకుని ఈ ఏడాది చివర్లో షూటింగ్ మొదలుపెడతారేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు