శివాజీని కెలికితే అంతేన‌ట‌ !

శివాజీని కెలికితే అంతేన‌ట‌ !

ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం జ‌రుగుతున్న పోరాటంలో సినీ న‌టుడు శివాజీ పేరు ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే... ఏ ఒక్క‌రూ త‌న‌తో క‌లిసి రాకున్నా కూడా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను ఆశించిన శివాజీ నిజంగానే ఒంట‌రి పోరు సాగించారు. ఒకానొక స‌మ‌యంలో ఆమ‌ర‌ణ దీక్ష‌కు కూడా దిగిన ఆయ‌న‌ను చంద్ర‌బాబు ప్ర‌భుత్వం బ‌లవంతంగా ఆస్ప‌త్రిలో చేర్పించేసింది. ఆ త‌ర్వాత కూడా వీల‌యిన అన్ని ర‌కాల్లో నిర‌స‌న తెలిసిన శివాజీ... ఎంత‌కూ త‌న‌కు మ‌ద్ద‌తు తెలిపే వారే లేక‌పోవ‌డంతో ఉద్య‌మానికి దాదాపుగా విరామ‌మిచ్చేసిన‌ట్లుగా క‌నిపించారు.

ఇంకా చెప్పాలంటే... ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం శివాజీ ఏకంగా త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తును కూడా ప‌ణంగా పెట్టేశార‌నే చెప్పాలి. ప్ర‌త్యేక హోదా పోరు మొదలుపెట్టేనాటికి బీజేపీ నేత‌గా ఉన్న శివాజీ.. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చేందుకు బీజేపీ స‌సేమిరా అనడంతో ఆయ‌న ఆ పార్టీకి రాజీనామా చేసేశారు. అంతేకాకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అని కూడా చూడ‌కుండా బీజేపీపై ఆయ‌న ఎప్ప‌టిక‌ప్పుడు ఘాటు వ్యాఖ్య‌ల‌తో విరుచుకుప‌డుతూనే ఉన్నారు.

మొన్న‌టికి మొన్న ప్ర‌త్యేక హోదా పోరు ఉధృత‌మైన నేప‌థ్యంలో మ‌ళ్లీ క‌ద‌న‌రంగంలోకి దిగేసిన శివాజీ... ద‌క్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ఓ జాతీయ పార్టీ *ఆప‌రేష‌న్ ద్ర‌విడ‌* పేరిట ప్ర‌త్యేక వ్యూహానికి ప‌దును పెడుతోంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ ఆప‌రేష‌న్‌ను ఏ పార్టీ చేప‌డుతోంద‌న్న విష‌యాన్ని శివాజీ చెప్ప‌కున్నా... ఆ పార్టీ బీజేపీనేన‌ని అర్థం వ‌చ్చేలా శివాజీ సుదీర్ఘ ప్ర‌సంగ‌మే చేశారు.

శివాజీ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌, రాజ‌మండ్రి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌... ఆప‌రేష‌న్ ద్ర‌విడ వినేందుకే ఇంపుగా ఉంటుంద‌ని, వాస్త‌వానికి ఇది స‌త్య‌దూర‌మ‌ని కొట్టిపారేశారు. ఎవ‌రో చెప్పిన క‌థ‌ను న‌మ్మి శివాజీ... దానికి మ‌రింత మ‌సాలా ద‌ట్టించి సినిమా స్టోరీలా ఆస‌క్తిగా చెప్పార‌ని కూడా ఉండ‌వ‌ల్లి పేర్కొన్నారు. ఉండ‌వ‌ల్లి వ్యాఖ్య‌ల‌పై నిన్న‌టిదాకా కాస్తంత మౌన‌మే పాటించిన శివాజీ... ఓ మీడియా ప్ర‌తినిధి త‌న‌ను ప్ర‌శ్నించ‌గానే దాదాపుగా బ‌ర‌స్ట్ అయిపోయారు. ఆపరేషన్ గరుడ గురించి తాను వివరాలను వెల్లడిస్తే... ఉండవల్లికి ఉలుకెందుకని శివాజీ ఘాటుగా స్పందించారు.

గత 10 నుంచి 12 ఏళ్లుగా ఆయనను తాను గమనిస్తున్నానని... ఏ ఇద్దరు కూడా ప్రశాంతంగా ఉండకూడదనేని ఉండవల్లి తత్వమని శివాజీ విమర్శించారు. ఏదో ఒక పక్క ఉండి అవతలివారిపై నిందలు వేస్తుంటారని... తద్వారా బెనిఫిట్ పొందుతుంటారని అన్నారు. ఆయన చెబితే భగవద్గీత... మేము చెబితే పిచ్చి మాటలా? అని మండిపడ్డారు. తాను చెప్పింది నమ్మాలని ఉండవల్లిని అడిగానా? అని కూడా ఎదురు ప్ర‌శ్నించారు. నాలుగు రోజులకు ఒకసారి రాజమండ్రిలో ఉండవల్లి ప్రెస్ మీట్ పెడుతుంటారని... ఆయనకు యూట్యూబ్ ఛానల్ ఉందేమో అని తన స్నేహితుడు ఒకరు అన్నారని శివాజీ అన్నారు.

మీ బెనిఫిట్స్ కోసం ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తే ఎలా అని ఉండవల్లిని ప్రశ్నించారు. తనకు బెనిఫిట్స్ మీద ఆశ ఉంటే... బీజేపీ నుంచి బయటకు వచ్చేవాడినే కాదని చెప్పారు. తనను కెలికితే గతంలో పోలవరం గురించి ఉండవల్లి మాట్లాడినవన్నీ వీడియోలో పెట్టి చూపిస్తానని హెచ్చరించారు. తాను ప్రశాంతంగా రాష్ట్రం కోసం పని చేస్తున్నానని... తనను రెచ్చగొట్టొద్దని చెప్పారు. మొత్తంగా త‌న‌ను కెలికితే తాను కూడా మ‌రింత‌గా బ‌ర‌స్ట్ కాక త‌ప్ప‌ద‌ని కూడా ఉండ‌వ‌ల్లికి శివాజీ భారీ వార్నింగే ఇచ్చేశారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు