పరుచూరి చెప్పిన ‘రచ్చ’ సీక్రెట్

పరుచూరి చెప్పిన ‘రచ్చ’ సీక్రెట్

లెజెండరీ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ.. ‘పరుచూరి పాఠాలు’ పేరుతో యూట్యూబ్‌లో తన అనుభవాల్ని పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తమ సోదరులు పని చేసిన సినిమాలకు సంబంధించి ఆసక్తికర విశేషాలు ఆయన వెల్లడిస్తున్నారు. మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు నేపథ్యంలో తాజా ఎపిసోడ్లో ఆయన ఈ మెగా హీరో గురించి మాట్లాడారు. చరణ్‌తో తమ అనుబంధం గురించి పంచుకున్నారు.

చరణ్‌తో తాము తొలిసారిగా ‘రచ్చ’ సినిమాకు పని చేశామని.. కానీ ఆ చిత్రానికి తాము పని చేయడం అనుకోకుండా జరిగిందని గోపాలకృష్ణ చెప్పారు. సంపత్ నంది ‘రచ్చ’ కథను చిరంజీవికి చెప్పగా.. ఆయన తమతో డైలాగులు రాయించుకోమని చెప్పారన్నారు. ఐతే సంపత్‌కు తమను కలవడం ఇష్టం లేదని.. కానీ చిరు చెప్పడంతో తప్పక తమ దగ్గరికి వచ్చాడని.. ఐతే అతడిని మెప్పించేలా తాము స్క్రిప్టులో మార్పులు చేర్పులు చెప్పి డైలాగులు రాశామని గోపాలకృష్ణ వెల్లడించారు. ఈ సినిమాలో ‘‘నువ్వు అరిస్తే అరుపులే.. నేను అరిస్తే మెరుపులే’’ అన్న డైలాగ్ విన్న చిరు.. తాను పరుచూరి సోదరుల్ని కలవమన్నది ఇందుకే అని సంపత్‌తో అన్నట్లు ఆయన తెలిపారు.

ఆ తర్వాత చరణ్ నటించిన ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాకు కూడా తాము పని చేశామని.. అది యావరేజ్‌గా ఆడిందని.. మనం అనుకున్న స్థాయిలో ఆ చిత్రం ఎందుకు ఆడలేదని కృష్ణవంశీ తనను అడిగితే.. ‘మగధీర’తో చరణ్ ఇమేజ్ ఆకాశమంత స్థాయికి వెళ్లిపోయిందని.. అతడిని అభిమానులు ఇలాంటి మామూలు పాత్రల్లో అంగీకరించలేకపోయారని చెప్పినట్లు పరుచూరి వెల్లడించారు. తర్వాత చరణ్ నిర్మించిన ‘ఖైదీ నంబర్ 150’కి కూడా తాము పని చేశామని.. ఇప్పుడు ‘సైరా’కూ రచన చేశామని.. ఈ సినిమాతో చరిత్ర సృష్టించాలని చరణ్ ఆరాటపడుతున్నాడని గోపాలకృష్ణ అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు