‘పోపోవోయ్..’! బాబుకు అమిత్‌షా లేఖ సారాంశం ఇదే..

‘పోపోవోయ్..’! బాబుకు అమిత్‌షా లేఖ సారాంశం ఇదే..

ఎన్డీయే నుంచి బయటకొచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు రాసిన లేఖకు ఆయన తాజాగా బదులిచ్చారు. ఆ సమాధానం ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది. చంద్రబాబు తమను వదిలేసినందుకు ఏమాత్రం బాధపడకపోగా తిరిగి చంద్రబాబుకు స్ట్రాంగు కౌంటరేశారు. చంద్రబాబు నిర్ణయం వెనుక ఉణ్న రాజకీయ అజెండాలు, రాజకీయ ప్రయోజనాలు అన్నిటినీ ఆయన బయటపెట్టారు. అమిత్ షా సమాధానం ‘పోతే పొండి’ అన్నట్లుగా ఉందని టీడీపీ వర్గాలే అంటున్నాయి.

చంద్రబాబుకు అమిత్ షా రాసిన లేఖలో కేంద్రం తరపున చేపట్టిన కార్యక్రమాలు, విభజన చట్టంలోని అంశాలు, ఏపీకి ఇచ్చిన ప్రాజెక్టుల వివరాలను ప్రస్తావించారు. మొత్తం తొమ్మిది పేజీల లేఖను ఆయన రాశారు.  ‘‘మీకు, ఐదు కోట్ల మంది ఆంధ్రులకు ఉగాది శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం మీ అందరికీ సంతోషాన్ని, మంచి ఆరోగ్యాన్ని తీసుకొస్తుందని కోరుకుంటున్నా. ఎన్డీయే కుటుంబం నుంచి టీడీపీ వెలుపలికి వచ్చిన తర్వాత ఈ లేఖ రాస్తున్నా. టీడీపీ తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యకరం, పూర్తిగా ఏకపక్షమైనది. అభివృద్ధికి సంబంధించిన కారణాలతో కాకుండా, రాజకీయపరంగా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల నేను భయపడుతున్నా. టీడీపీ నిర్ణయం దురదృష్టకరం.  అందరూ అభివృద్ధి చెందాలనేదే తమ రాజకీయ సిద్ధాంతం. ఏపీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనేది బీజేపీ అజెండాలో ఓ భాగం. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏపీకి ఎంతో చేసింది’’ అని పేర్కొన్నారు.

ఏపీ ప్రజల ఆకాంక్షలపట్ల బీజేపీకి ఏమాత్రం సానుభూతి లేదని  చంద్రబాబు చెబుతున్నవన్నీ అవాస్తవాలని ఆయన ధ్వజమెత్తారు. ఎన్డీయే సర్కార్‌ ఏపీకి ఇచ్చే కేంద్ర సహాయాన్ని రెండింతలు పెంచిందని, బీజేపీ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని చెప్పారు. రాజధాని కోసం కేంద్రం విడుదల చేసిన నిధుల్లో కేవలం 8శాతం మాత్రమే ఏపీ వాడుకుందన్నారు. పోలవరానికి రూ.5,364 కోట్లు కేటాయించామని చెప్పిన ఆయన చంద్రబాబు ప్రభుత్వం నుంచి జరిగిన తీవ్రమైన తప్పిదాలను ఎప్పటికీ విస్మరించలేమన్నారు. కేంద్రం నిధులకు సంబంధించి ఎలాంటి లెక్కలు ఇప్పటి వరకు చంద్రబాబు ప్రభుత్వం సమర్పించలేదని, ప్రభుత్వాలు ప్రతి పైసా ఖర్చుపై ప్రజలకు లెక్క చెప్పాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. మ‌రి ఇప్ప‌టికే ఏపీ ప్ర‌జ‌ల మ‌న‌సులో అడ్రెస్ కోల్పోయిన బీజేపీ ఇప్ప‌టికీ ఎందుకింత యారోగెంట్‌గా ప్ర‌వ‌ర్తిస్తుంద‌నేది మిలియ‌న్ డాల‌ర్ ప్ర‌శ్న‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు