ఈ వారసురాలు ఏం చేస్తుందో?

ఈ వారసురాలు ఏం చేస్తుందో?

సినీ కుటుంబాల నుంచి హీరోలు లెక్కలేనంత మంది వస్తుంటారు కానీ.. హీరోయిన్ల రాక అరుదు. ఒకప్పుడైతే అసలు ఈ ఛాయలే ఉండేవి కావు. ఐతే గత కొన్నేళ్లలో పరిస్థితి మారింది. నెమ్మదిగా సినీ ఫ్యామిలీల నుంచి అమ్మాయిలు నటన వైపు అడుగులేస్తున్నారు. ఈ విషయంలో చాలామందికి మంచు లక్ష్మీప్రసన్న స్ఫూర్తి అని చెప్పాలి. ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో ప్రతినాయికగా పరిచయమైన మంచు లక్ష్మి.. ఆ తర్వాత హీరోయిన్ పాత్రలూ వేసింది. కానీ ఆమె ఇప్పటిదాకా ఒక్క విజయమూ అందుకోలేదు. ఈమె తర్వాత అరంగేట్రం చేసిన మెగా అమ్మాయి కొణిదెల నీహారికకు కూడా తొలి సినిమా ‘ఒక్క మనసు’ పెద్ద షాకే. ఇక ఆమె రెండో సినిమా ఏమవుతుందో చూడాలి.

వీళ్లిద్దరి కంటే ముందు నటనలో అదృష్టాన్ని పరీక్షించుకున్న మంజుల.. సుప్రియ లాంటి వాళ్లకూ కలిసి రాలేదు. ఇప్పుడు సినీ కుటుంబం నుంచి మరో అమ్మాయి నటనలోకి అడుగుపెడుతోంది. ఆమే సీనియర్ హీరో రాజశేఖర్ తనయురాలు శివాని. తెరంగేట్రం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న శివాని.. ఎట్టకేలకు హిందీ హిట్ ‘2 స్టేట్స్’ రీమేక్‌తో కథానాయికగా మారుతోంది. ఈ చిత్రం ఈ రోజే ప్రారంభోత్సవం జరుపుకుంది. అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకట్ కుంచం అనే కొత్త దర్శకుడు రూపొందించనున్నాడు.

ఎంఎల్వీ సత్యనారాయణ నిర్మించనున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్నందించబోతున్నాడు. మరి ఈ చిత్రం విజయవంతమై సినీ ఫ్యామిలీ హీరోయిన్ల ట్రాక్ రికార్డును శివాని అయినా మారుస్తుందేమో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు