ఔను.. రవితేజ సినిమాకు నో చెప్పా-కాజల్

ఔను.. రవితేజ సినిమాకు నో చెప్పా-కాజల్

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ‘లక్ష్మీకళ్యాణం’ లాంటి చిన్న సినిమాతో కథానాయికగా పరిచయమైన కాజల్ అగర్వాల్.. ఆపై స్టార్ హీరోయిన్ అయింది. పెద్ద పెద్ద హీరోల సరసన నటించింది. మీడియం రేంజి హీరోలకు కూడా దొరక్కుండా పోయిన కాజల్.. ఈ మధ్య కొంచెం రేంజ్ తగ్గించింది. రానాతో పాటు కళ్యాణ్ రామ్ సరసనా నటించింది. కానీ మాస్ రాజా రవితేజ హీరోగా తెరకెక్కబోయే సినిమాకు మాత్రం ఆమె నో చెప్పినట్లుగా వార్తలొచ్చాయి.

ఈ విషయమే కాజల్ దగ్గర ప్రస్తావిస్తే ఆ మాట నిజమే అంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కబోయే సినిమాకు తనను అడిగారని.. కానీ డేట్లు సర్దుబాటు చేయడం కష్టంగా ఉండటంతో ఆ సినిమాకు నో చెప్పాల్సి వచ్చిందని ఆమె వెల్లడించింది. ఇక ప్రస్తుతం తన కమిట్మెంట్ల గురించి కాజల్ చెబుతూ.. ‘క్వీన్’ తమిళ రీమేక్‌తో పాటు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కబోయే సినిమాలోనూ నటించబోతున్నట్లు ఆమె వెల్లడించింది.

తన తొలి సినిమా ‘లక్ష్మీకళ్యాణం’ తర్వాత సినిమాల్లో కొనసాగాలని అనుకోలేదని.. ఎంబీఏ చదవాలనుకున్నానని.. కానీ అనుకోకుండా మంచి మంచి అవకాశాలు వచ్చి బిజీ అయిపోయానని.. సుదీర్ఘ కాలం కథానాయికగా కొనసాగుతుండటం ప్రేక్షకుల చలవేనని కాజల్ అంది. తాను ప్రత్యేక పాత్ర పోషించిన ‘అ!’ సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరించారని.. వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని కాజల్ అంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు