అపోలో ట్విస్ట్ః అప్పుడు కెమెరాలు ప‌నిచేయ‌లేద‌ట‌

అపోలో ట్విస్ట్ః అప్పుడు కెమెరాలు ప‌నిచేయ‌లేద‌ట‌

త‌మిళ‌నాడు దివంగ‌త‌ ముఖ్య‌మంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంఫై రోజుకో ఎపిసోడ్ తెర‌మీద‌కు వ‌స్తోంది.అమ్మ మ‌ర‌ణంలోని అస‌లు నిజాలు తెలుసుకునేందుకు పళనిస్వామి ప్రభుత్వం రంగంలోకి దిగిన సంగ‌తి తెలిసిందే. అమ్మ మృతిపై రిటైర్డ్‌ జడ్జి ఆర్ముగస్వామి నేతృత్వంలో న్యాయవిచారణకు ఆదేశించింది.ఈ క‌మిష‌న్ ముందు సంచ‌ల‌న అంశాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఇంకా వ‌స్తుండ‌టం విశేషం. అమ్మ మ‌ర‌ణంపై అర్ముగ స్వామి క‌మిష‌న్‌ విచారణ జరుపుతున్న నేప‌థ్యంలో అమ్మ ఆస్ప‌త్రి పాల‌యిన స‌మ‌యంలోని కీల‌క వ్య‌క్తులు తెర‌మీద‌కు వ‌స్తున్నారు.  తాజాగా హాస్పిటల్ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు పంచుకున్నారు.

అపోలో ఇంటర్నేషనల్ సింపోజియం 2018లో భాగంగా ప్ర‌తాప్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందిన 75 రోజులూ అక్కడి సీసీటీవీ కెమెరాలు స్విచాఫ్ చేశామని ప్ర‌తావ‌ప్  చెప్పారు. జయలలిత మృతి కేసులో ఆర్ముగస్వామి కమిషన్‌కు అన్ని పత్రాలు అందించామని ఆయన చెప్పారు. ఈ సమయంలోనే మరి సీసీటీవీ ఫుటేజీని ఇచ్చారా అని ప్రశ్నించగా..`క్షమించండి.. దురదృష్టవశాత్తు ఆ 75 రోజులూ ఆసుపత్రిలో ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాలను వాళ్లు ఆఫ్ చేశారు. జయలలితను అడ్మిట్ చేయగానే ఐసీయూలోకి ఎవరూ వెళ్లకుండా మూసేశారు. మిగతా పేషెంట్లందరినీ మరో ఐసీయూలోకి తరలించారు. 24 బెడ్లు ఉన్న ఈ ఐసీయూలో ఆమె మాత్రమే ఉన్నారు. ఎవరూ చూడకూడదన్న ఉద్దేశంతో వాళ్లు సీసీటీవీ కెమెరాలను ఆఫ్ చేశారు` అని ప్రతాప్‌రెడ్డి వెల్లడించారు.

చికిత్స పొందుతున్న స‌మ‌యంలో జ‌య‌ల‌లిత‌ను కలవడానికి ఎవరినీ అనుమతించలేదని ప్ర‌తాప్ రెడ్డి చెప్పారు. `ఆసుపత్రిలో మేం ఫాలో అయ్యే విధానం ఒకటే.. ఐసీయూలోకి మరీ సన్నిహితులను తప్ప ఎవరినీ అనుమతించం. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఎవరినీ అనుమతించలేదు` అని ప్రతాప్‌రెడ్డి స్పష్టంచేశారు. ఆమెను బతికించడానికి ఆసుపత్రి శాయశక్తులా కృషి చేసినా ఫలితం లేకపోయిందని చెప్పారు. కమిషన్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆసుపత్రి తరఫున వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రతాప్‌రెడ్డి వివ‌రించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు