రాశి కెరీర్లో నచ్చని సినిమా అదొక్కటేనట..

రాశి కెరీర్లో నచ్చని సినిమా అదొక్కటేనట..

కొన్నిసార్లు కథ నచ్చకపోయినా.. పారితోషకం కోసం సినిమా చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు కథ విన్నపుడు బాగా అనిపించి సినిమా తెరకెక్కుతున్నపుడు తేడాగా అనిపిస్తుంది. కానీ కమిట్మెంట్ ఇచ్చాక సినిమా పూర్తి చేయక తప్పదు. ఇలా ముందే ఒక సినిమా ఆడదనే విషయంలో ఒక అంచనా వచ్చేస్తుంది. ఇలాంటి సినిమా ఎందుకు చేశామా అనే ఫీలింగ్ నటీనటులకు వస్తుంది. ప్రతి యాక్టర్ కెరీర్లోనూ ఇలాంటి సినిమాలు ఒకటో రెండో అయినా తప్పకుండా ఉంటాయి. తన కెరీర్లో కూడా అలాంటి సినిమా ఒకటుందని రాశి ఖన్నా అంటోంది.

‘‘ఇప్పటిదాకా 15 సినిమాల్లో నటించాను. అయితే ఒకే ఒక్క సినిమా చేసిన తర్వాత ‘ఈ సినిమా ఎందుకు చేశానా’ అన్న ఆలోచన వచ్చింది. ఆ సినిమా పేరు చెప్పను. కథ చెప్పినపుడు బాగానే అనిపించింది. కానీ తెరపై చూశాక నిరాశ చెందాను. ఆ సినిమా చేయాల్సింది కాదు’’ అని రాశి తెలిపింది. రాశి కెరీర్లో దారుణమైన ఫలితాన్నందుకునున సినిమాలు.. ‘జోరు’, ‘శివమ్’, ‘ఆక్సిజన్’, ‘టచ్ చేసి చూడు’. మరి ఈ నాలుగింట్లో రాశి చెబుతున్న సినిమా ఏదో మరి?

ఇక తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి రాశి చెబుతూ.. ‘‘తమిళంలో నేను కథానాయికగా మూడు సినిమాలు తెరకెక్కుతున్నాయి. సిద్ధార్థ్ హీరోగా రాబోతున్న ‘సైతాన్ కా బచ్చా’లో నటిస్తున్నా. అధ్వర్వతో ఓ సినిమా చేస్తున్నా. అందులో నయనతార కూడా కీలక పాత్ర చేస్తోంది. జయం రవితోనూ ఓ సినిమా కమిటయ్యాను. తెలుగులో కొత్త సినిమాలేవీ ఇంకా కమిటవ్వలేదు’’ అని రాశి చెప్పింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు