సునీల్‌ను మళ్లీ ఉచ్చులో బిగిస్తాడా?

సునీల్‌ను మళ్లీ ఉచ్చులో బిగిస్తాడా?

హీరోగా సునీల్ కెరీర్లో అతి పెద్ద హిట్‌గా నిలిచిన సినిమా ‘పూల రంగడు’. ఈ చిత్రం అప్పట్లోనే రూ.20 కోట్ల దాకా వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రం మాస్ ప్రేక్షకుల్లో సునీల్‌కు మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. ఐతే ఇంత పెద్ద విజయాన్నందించడంతో పాటు సునీల్‌కు ఈ చిత్రం చాలా చేటు కూడా చేసింది.

ఇందులో సిక్స్ ప్యాక్ చేయడమే కాక.. ఫైట్లు, డ్యాన్సులు కూడా బాగానే చేశాడు సునీల్. ఆ సినిమా వరకు అవి బాగానే సూటయ్యాయి. కానీ వాటి వల్లే ఆ సినిమా బాగా ఆడిందన్న భ్రమల్లో పడి.. ఆ తర్వాత మాస్ ఇమేజ్ కోసం వెంపర్లాడుతూ ఇదే తరహా ప్రయత్నాలు చేసి బోల్తా కొట్టాడు సునీల్. వరుసగా డిజాస్టర్ల మీద డిజాస్టర్లు తిని.. చివరికి హీరోగా పూర్తిగా ఆదరణ కోల్పోయి జీరో అయిపోయాడు.

చివరికి హీరో వేషాలు వదిలేసి మళ్లీ కమెడియన్ పాత్రలతో బిజీ అయ్యే ప్రయత్నంలో ఉన్నాడు. ఐతే అవకాశాలు లేకే సునీల్ హీరో వేషాలు మానుకున్నాడు తప్పితే అతడికి పూర్తిగా వాటిపై మోజు ఏమీ తగ్గలేదన్నది సన్నిహితుల మాట. అతనే హీరోగా మళ్లీ ఓ దర్శకుడు, నిర్మాత సినిమా చేయడానికి ముందుకొచ్చారట. ఆ దర్శకుడు మరెవరో కాదు.. ‘పూలరంగడు’తో సునీల్‌కు సూపర్ సక్సెస్ ఇచ్చిన వీరభద్రం చౌదరినే.

‘పూల రంగడు’ తర్వాత అక్కినేని నాగార్జున లాంటి స్టార్ హీరోను డైరెక్ట్ చేసే అవకాశమందుకున్న వీరభద్రం.. ‘భాయ్’తో గట్టి ఎదురు దెబ్బ తిన్నాడు. ఆపై అతను తీసిన ‘చుట్టాలబ్బాయి’ కూడా ఆడలేదు. చివరికిప్పుడు ‘ఒక అమ్మాయి తప్ప’ నిర్మాత భోగాది అంజిరెడ్డిని లైన్లో పెట్టి సునీల్ హీరోగా సినిమా తీయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడట. మరి వీరభద్రం మళ్లీ సునీల్ ను మాస్ ఉచ్చులో బిగిస్తాడా.. ఈ సారి వీళ్ల కాంబినేషన్లో రాబోయే సినిమా ఎలాంటి ఫలితాన్నందుకుంటుంది.. చూద్దాం మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు