కళ్యాణ్ రామ్ సంకేతాలు ఇచ్చేశాడుగా..

కళ్యాణ్ రామ్ సంకేతాలు ఇచ్చేశాడుగా..

‘‘నేనింకా రాజకీయం మొదలుపెట్టలేదు. మొదలుపెట్టాక మీరు చేయడానికేమీ మిగలదు’’.. ఇదీ ‘ఎమ్మెల్యే’ సినిమా ట్రైలర్లో నందమూరి కళ్యాణ్ రామ్ పేల్చిన డైలాగ్. వెంటనే దీనిపై హాట్ హాట్ డిస్కషన్లు మొదలైపోయాయి. నందమూరి కుటుంబానికి రాజకీయాలతో ఉన్న బంధమెలాంటిదో కొత్తగా చెప్పాల్సిన పని లేదు.

ఈ నేపథ్యంలో నందమూరి హీరో ‘ఎమ్మెల్యే’ అనే పేరుతో సినిమా చేసి.. ఇలాంటి డైలాగ్ పేల్చితే చర్చనీయాంశం కాకుండా ఎలా ఉంటుంది? దీనికి తోడు ఈ చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన పోసాని కృష్ణమురళి, వంశీ పైడిపల్లి కళ్యాణ్ రామ్‌ను ఎమ్మెల్యేగా చూడాలని ఉందన్నారు. దీంతో చర్చలు మరింత వేడెక్కాయి.

ఇదిలా ఉండగా నిన్న ఫేస్‌బుక్‌లో అభిమానులతో చిట్ చాట్ సందర్భంగా రాజకీయాల గురించి అడిగితే.. ‘‘మీరిక సినిమాలు మానేయండి జనాలు అన్నపుడు రాజకీయాల్లోకి వస్తా’’ అన్నాడు కళ్యాణ్ రామ్. తాను రాజకీయాల్లోకి రానని అనకపోవడంతోనే ఏదో ఒక రోజు అందులోకి దిగబోతున్న సంకేతాలు ఇచ్చినట్లే. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లోనూ కళ్యాణ్ రామ్ అన్న మాటలు ఆసక్తి రేకెత్తించేవే.

‘‘ఇప్పటికైతే నాకు ఆ ఆలోచనలు లేవు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేను’’ అంటూ నర్మగర్భమైన వ్యాఖ్యలు చేశాడు కళ్యాణ్ రామ్. మొత్తానికి ఈ నందమూరి హీరోకు రాజకీయాల పట్ల విముఖత లేదన్న విషయం మాత్రం అర్థమవుతోంది. కాబట్టి ఈ ఎన్నికల్లో కాకపోతే వచ్చే ఎన్నికల్లో అతను రాజకీయ రంగప్రవేశం చేస్తాడేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు