‘నారప్ప’ ఓటీటీ రిలీజ్ కు కారణమతడే!

Narappa

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుందో అందరికీ తెలిసిందే. కొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉండగా.. మరికొన్ని ఫస్ట్ కాపీతో రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. కానీ థియేటర్ వ్యవస్థ ఇంకా ఓ కొలిక్కి రాకపోవడంతో చాలా మంది నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు.

చిన్న సినిమాలు మాత్రమే కాదు.. భారీ బడ్జెట్ తో నిర్మించిన పెద్ద సినిమాలను సైతం ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఆందోళనకు దిగారు. అయినప్పటికీ ఓటీటీ రిలీజ్ లు ఆగడం లేదు.

తాజాగా ‘నారప్ప’ లాంటి పెద్ద సినిమా కూడా ఓటీటీలో రాబోతుంది. ఎగ్జిబిటర్ల రిక్వెస్ట్ ను కన్సిడర్ చేసి సురేష్ బాబు కొన్నాళ్లు ఆగుతారేమో అనుకున్నారు కానీ అలా జరగడం లేదు. ఈ నెల 20న ‘నారప్ప’ అమెజాన్ ప్రైమ్ లో రానుంది. అయితే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి గల కారణాలను తాజాగా ఆయన చెప్పుకొచ్చారు. ‘అసురన్’ సినిమా ఫస్ట్ హాఫ్ చూసిన వెంటనే నిర్మాత కళైపులి థానుకి ఫోన్ చేసి రైట్స్ అడిగిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు సురేష్ బాబు.

అయితే ఆ సమయంలో థాను కూడా సినిమా నిర్మాణంలో భాగం అవుతానని చెప్పడంతో.. సినిమా ఓకే అయిందని.. ఆ సమయంలో ఓటీటీకి ఇవ్వాలనే ఆలోచనే లేదని సురేష్ బాబు అన్నారు. అయితే ధనుష్ హీరోగా థాను నిర్మించిన ‘కర్ణన్’ సినిమా పాండమిక్ సమయంలోనే రిలీజ్ చేశారని.. సినిమా బాగానే ఆడినప్పటికీ, రెండు వారాల తరువాత సెకండ్ వేవ్ ప్రభావంతో థియేటర్లు మూతపడ్డాయని.. ఇప్పుడు కూడా ఆ పరిస్థితి చోటుచేసుకునే ప్రమాదం ఉందని ‘నారప్ప’ను ఓటీటీకి ఇవ్వాలంటూ డీల్ వచ్చిందని థాను చెప్పినట్లు.. ఆయన కూడా నిర్మాత కావడంతో నో చెప్పలేకపోయానని సురేష్ బాబు వివరించారు.

ఈ సినిమా ఓటీటీకి వస్తుందని వెంకటేష్ కి చెప్పినప్పుడు ఆయన కూడా చాలా బాధపడ్డారని కానీ మరో మార్గం కనిపించలేదని చెప్పుకొచ్చారు. చాలా మంది అభిమానులు ఫోన్ చేసి ఎమోషనల్ అయిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. తనకు కూడా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల కష్టాలు తెలుసనీ.. మళ్లీ సాధారణ పరిస్థితులు వస్తాయని ఆశిస్తున్నట్లు సురేష్ బాబు చెప్పుకొచ్చారు.