రాఘవేంద్రరావు కోడలిది పెద్ద ప్రాజెక్టే

రాఘవేంద్రరావు కోడలిది పెద్ద ప్రాజెక్టే

రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి పెళ్లాడిన కనిక ధిల్లాన్ బాలీవుడ్ జనాలకు బాగానే పరిచయం. ఆమె ఇక్కడ కొన్నేళ్ల పాటు బాలీవుడ్ సినిమాలకు పని చేసింది. షారుఖ్ ఖాన్‌కు చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్‌లో ఆమె కీలక పాత్ర పోషించింది. ఆ బేనర్లో వచ్చిన ఓం శాంతి ఓం, బిల్లు బార్బర్, రా.వన్ సినిమాలకు ఆమె సహ రచయితగా ఉంటూనే ప్రొడక్షన్ వ్యవహారాలు కూడా చూసుకుంది.

ఆ తర్వాత ప్రకాష్‌ను పెళ్లాడి హైదరాబాద్‌లో సెటిలైపోయిన కనిక.. భర్తను దర్శకుడిగా నిలబెట్టడం కోసం ‘సైజ్ జీరో’ స్క్రిప్టు కూడా రాసిచ్చింది. కానీ ప్రకాష్ ఆ కథను జనాలకు చేరువ చేయలేకపోయాడు.

ఇప్పుడు ప్రకాష్ ‘మెంటల్ హై క్యా’ సినిమాతో బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సంగతి తెలిసిందే. దీనికి కనిక రచనా సహకారం అందిస్తూనే.. హిందీలో మరో పెద్ద ప్రాజెక్టుకు కూడా పని చేస్తోంది. విలక్షణమైన సినిమాలతో గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అనురాగ్ కశ్యప్ కొత్త సినిమాకు కనికనే స్క్రిప్టు సమకూర్చడం విశేషం. ఆ చిత్రం పేరు ‘మన్మార్జియాన్’. అనురాగ్ లాంటి దర్శకుడు కనిక స్క్రిప్టుతో సినిమా చేయడమంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయమే.

ఈ చిత్రాన్ని అనురాగ్‌తో పాటు ప్రముఖ దర్శకుడు ఆనంద్.ఎల్.రాయ్.. మధు మంతెన లాంటి అగ్ర నిర్మాత కలిసి నిర్మిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్, విక్కీ కౌశల్, తాప్సి పన్ను ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబరు 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు