90 మార్కులొచ్చినా కళ్యాణ్ రామ్‌కు దెబ్బలే

90 మార్కులొచ్చినా కళ్యాణ్ రామ్‌కు దెబ్బలే

పెద్దగా చదువు అబ్బని వాళ్లే సినిమాల్లోకి వస్తారన్న అభిప్రాయం ఉండేది ఒకప్పుడు. అందుకు చాలా ఉదాహరణలే కనిపిస్తాయి కూడా. చదువు మధ్యలో వదిలేసి సినిమాల్లోకి వచ్చిన వాళ్లు లెక్కలేనంత మంది కనిపిస్తారు. ఐతే ఇప్పుడు సినిమాల్లోకి రావాలన్న నిర్ణయం ముందే జరిగినా.. మినిమం డిగ్రీ పూర్తి చేశాక ఇటు వస్తున్నారు చాలామంది.

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగం కూడా చేశాడు. వ్యాపారాలు నడిపాడు. ఆ తర్వాతే సినిమాల వైపు అడుగులేశాడు. చిన్నప్పట్నుంచి తాను చదువుల్లో చాలా మెరుగ్గా ఉండేవాడినని.. తనకు 90 శాతం మార్కులొచ్చినా ఇంట్లో స్కేలుతో కొట్టే పరిస్థితి ఉండేదని తాజాగా ఒక ఇంటర్వ్యూలో అతను వెల్లడించాడు.

తాను ఇంట్లో ఎంత బుద్ధిగా ఉండేవాడినో వివరిస్తూ.. ‘‘చిన్నప్పట్నుంచి మా అమ్మ ఎప్పుడూ చదువుకోవాలనే చెబుతుండేవారు. చదువే జీవనాధారం అనేవారు. 90 శాతం మార్కులు వచ్చినా దెబ్బలు తప్పేవి కావు. ఇంకా ఎక్కువ తెచ్చుకోవాలనేవారు. ఇంజినీరింగ్ పూర్తి చేశాక సినిమాల్లోకి రావాలనుకున్నా. నిర్మాత కావాలనుకున్నా. కానీ నాన్నకు చెబితే భయపడ్డారు. పై చదువుల కోసం అమెరికాకు పంపించారు. తిరిగి వచ్చాక సినిమాల్లోకి వచ్చాను. నా తొలి రెండు సినిమాలు ఫ్లాపయ్యాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్ మొదలుపెట్టాను. ఆ బేనర్ మీద చేసిన తొలి సినిమా హిట్టయింది. ఆ సినిమా హిట్టవ్వగానే నాన్న ఒకమ్మాయిని చూపించి పెళ్లి చేసుకోమన్నారు. కొంచెం టైం కావాలని అన్నా కూడా ఒప్పుకోలేదు. పెళ్లి చేసేశారు’’ అని కళ్యాణ్ రామ్ తెలిపాడు.