హీరో హామీ: ఒక్క క్షణం కూడా బోర్ కొట్టదు

హీరో హామీ: ఒక్క క్షణం కూడా బోర్ కొట్టదు

నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ‘ఎమ్మెల్యే’ ట్రైలర్ చూస్తే అది సగటు కమర్షియల్ సినిమా లాగే అనిపించింది. ఇదేమంత కొత్తదనం ఉన్న సినిమాలా కనిపించలేదు. కానీ కళ్యాణ్ రామ్ మాత్రం ఈ సినిమా చాలా చాలా కొత్తగా ఉంటుందని.. ఈ సినిమాతో కొత్త కళ్యాణ్ రామ్‌ను చూస్తారని అంటున్నాడు.

తన లుక్.. బాడీ లాంగ్వేజ్.. కాస్ట్యూమ్స్.. డైలాగ్ డెలివరీ.. క్యారెక్టరైజేషన్.. ఇలా ప్రతి విషయంలోనూ కొత్తదనం చూస్తారని.. సినిమా కూడా కొత్తగా ఉంటుందని అతనన్నాడు. ఈ చిత్ర నిడివి ఎంతో కూడా కళ్యాణ్ రామ్ వెల్లడించాడు. 2 గంటల 9 నిమిషాలతో ఫైనల్ కట్ రెడీ అయిందని.. సినిమాలో ఒక్క క్షణం కూడా బోర్ కొట్టదని తాను హామీ ఇస్తున్నానని ఈ చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్లో కళ్యాణ్ రామ్ అన్నాడు.

దర్శకుడు ఉపేంద్ర మాధవ్ తనకు కథ చెప్పడమే రెండున్నర గంటలు చెప్పాడని.. ఆ సమయంలో సినిమాను కళ్లకు కట్టినట్లు చూపించాడని.. ఆ తర్వాత చెప్పినట్లే సినిమా తీశాడని అన్నాడు. పర్ఫెక్షన్ విషయంలో అతను ఏమాత్రం రాజీ పడేవాడు కాదని.. ఒక సన్నివేశాన్ని ఉదయం మొదలుపెడితే.. మధ్యాహ్నం 3 వరకు కూడా ఓకే చేయలేదని.. డైలాగ్ చెబుతుంటే మధ్యలో వచ్చి ఇలా కాదంటూ అడ్డం పడిపోయేవాడని.. ఇలా అతను మామూలుగా టార్చర్ పెట్టలేదని కళ్యాణ్ రామ్ అన్నాడు. కళ్యాణ్ రామ్ ఈ మాట అంటుండగా.. ఉపేంద్ర మధ్యలో జోక్యం చేసుకుని.. ‘‘సార్ మీరిలా అంటే నాకెవ్వరూ ఇకపై డేట్లివ్వరు’’ అన్నాడు. వెంటనే కళ్యాణ్ రామ్.. ‘‘ఇలాగే మధ్యలో వచ్చేసేవాడు. మొత్తం చెప్పే వరకు వినాలి. పర్ఫెక్షన్ కోసం నటీనటుల్ని అలా టార్చర్ పెట్టడం మంచి లక్షణమే’’ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు