పోసానికి ఆవేశం తన్నుకొచ్చేసింది

పోసానికి ఆవేశం తన్నుకొచ్చేసింది

మాటలకు ముసుగేయకుండా మాట్లాడే సినీ ప్రముఖుడు పోసాని కృష్ణమురళి. ఆయన ఏదైనా వేదిక మీద మైకందుకున్నాడంటే మాటలు బుల్లెట్లలా దూసుకొస్తుంటాయి. ఆ మాటలు కొందరికి గట్టిగా తగులుతుంటాయి. తాజాగా ‘ఎమ్మెల్యే’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లోనూ పోసాని తనదైన శైలిలో తూటాల్లాంటి మాటలు పేల్చాడు. ఒక దశలో ఆయన బాగా ఆవేశ పడిపోతూ చేసిన రాజకీయ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

నందమూరి కళ్యాణ్ రామ్ ఎలా హీరోగా మారాడో చెబుతూ.. అతడిని హీరోను చేసే విషయంలో హరికృష్ణ తననే సలహా అడిగాడని పోసాని వెల్లడించాడు. అప్పటికి కళ్యాణ్ రామ్ అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ, వ్యాపారాలు నడుపుతూ మంచి స్థితిలో ఉండేవాడని.. ఐతే అవన్నీ వదులుకుని సినిమాల్లోకి రావాలనుకున్నాడని.. అలాంటి మంచి వ్యక్తి సినిమాల్లోకి వస్తే అందరికీ మంచి జరుగుతుందని.. చాలామందికి ఉపాధి దొరుకుతుందని భావించి అతడి రాకను తాను స్వాగతించానని పోసాని చెప్పాడు.

ఇప్పుడు కళ్యాణ్ రామ్ ‘ఎమ్మెల్యే’ అనే సినిమా చేయడం చాలా సంతోషమన్న పోసాని.. అతను నిజంగానే మంచి లక్షణాలున్న అబ్బాయి అని.. కాబట్టి అతను నిజ జీవితంలోనూ ఎమ్మెల్యే కావాలన్నది తన ఆకాంక్ష అని చెప్పాడు పోసాని. ఈ సందర్భంలోనే ఆయన ఆవేశపడ్డారు. తెలుగుదేశం పార్టీ మీది.. తెలుగుదేశం పార్టీ మీది.. అంటూ ఆవేశంగా నొక్కి వక్కాణించిన పోసాని.. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులే ఆ పార్టీని చేతికి తీసుకోవాలన్నట్లుగా మాట్లాడారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడిన పోసాని.. కొన్నేళ్లుగా స్వరం మార్చారు. ఆ పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. వైఎస్సార్ కాంగ్రెస్‌కు మద్దతుగా కనిపిస్తున్న నేపథ్యంలో ఆయన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు