చిరు కోసం నయన్ ఆగమనం

చిరు కోసం నయన్ ఆగమనం

ఎప్పుడో ఏడాది కిందటే కన్ఫమ్ అయిన ప్రాజెక్టు ‘సైరానరసింహారెడ్డి’. రెగ్యులర్ షూటింగ్ ఇదిగో అదిగో అంటూనే సాగిపోయింది. సినిమా లాంఛనంగా మొదలైన చాలా కాలానికి షూటింగ్ మొదలుపెట్టారు. కానీ అంతలోనే బ్రేకులు పడ్డాయి. ఇందుకు కారణాలు అనేకం. నామమాత్రంగా ఒక షెడ్యూల్ చేసి.. ఆ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్నారు.

ఈ చిత్ర ఛాయాగ్రాహకుడు రత్నవేలు ‘రంగస్థలం’కి కూడా పని చేస్తుండటంతో.. దాని పనంతా అయ్యేవరకు ఈ చిత్ర బృందం ఎదురు చూడాల్సి వచ్చింది. ఐతే కొన్ని రోజుల కిందటే ‘రంగస్థలం’కు గుమ్మడికాయ కొట్టేసి ‘సైరా’ మీదికి వచ్చేశాడు రత్నవేలు. దీంతో ఇక బ్రేకుల్లేకుండా షూటింగ్ చేయాలని పట్టుదలకు వచ్చింది చిత్ర బృందం.

ఇటీవలే ‘సైరా’ రెండో షెడ్యూల్ మొదలైంది. ఓ కీలక ఘట్టం చిత్రీకరణ జరుగుతోందట ప్రస్తుతం. చిరు షూటింగ్‌లో పాల్గొంటుండగా.. తీసిన ఒక ఫొటో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం కథానాయిక నయన్ షూటింగ్‌కు వచ్చిందట. జగపతిబాబు, నయన్ కాంబినేషన్లో సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందట. త్వరలోనే ప్రధాన తారాగణమంతా చిత్ర బృందంతో కలుస్తుందని.. అక్కడి నుంచి ఏకధాటిగా చిత్రీకరణ చేయాలని దర్శకుడు సురేందర్ రెడ్డి భావిస్తున్నారు.

బిగ్-బి అమితాబ్ కొంచెం ఆలస్యంగా షూటింగుకి వస్తారని సమాచారం. ఆయనపై కొన్ని రోజులే చిత్రీకరణ ఉంటుందట. ఈ చిత్రం కిచ్చా సుదీప్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు