సుమంత్ పెద్ద రిస్కే చేస్తున్నట్లున్నాడే..

 సుమంత్ పెద్ద రిస్కే చేస్తున్నట్లున్నాడే..

దాదాపు రెండు దశాబ్దాల నుంచి హీరోగా కొనసాగుతున్నాడు సుమంత్. కానీ ఇప్పటికీ నిలదొక్కుకోలేదు. ఒక దశలో అతడి కెరీర్ ముగిసినట్లే కనిపించింది. కానీ అతను ప్రయత్నాలు ఆపలేదు. గత ఏడాది ‘మళ్ళీ రావా’ అతడికి కొంత ఉపశమనాన్నందించింది. మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకున్న ఈ చిత్రం ఓ మోస్తరు వసూళ్లు రాబట్టింది.

సుమంత్‌కు క్రేజ్ ఉండి ఉంటే ఈ సినిమా బాగా ఆడేదే. జనాలకు తెలిసేలోపే థియేటర్ల నుంచి వెళ్లిపోయింది. ఐతే ఈ సినిమా తెచ్చిన గుర్తింపుతో ఉత్సాహంగా మరో సినిమాకు శ్రీకారం చుట్టాడు సుమంత్. ‘సుబ్రహ్మణ్యపురం’ పేరుతో అతను తాజాగా ఒక సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.

ఈ చిత్ర టైటిల్.. దాని లోగో అదీ చూస్తే ఇది కొంచెం పెద్ద స్థాయి సినిమాలాగే అనిపిస్తోంది. బడ్జెట్ కూడా ఎక్కువే అయ్యేలా కనిపిస్తోంది. సుమంత్‌కు ఇది 25వ సినిమా కావడంతో దీన్ని అతను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. పోస్టర్ మీద ‘సుమంత్ 25వ సినిమా’ అనే లోగో కూడా వేశారు. అందుకే ఖర్చు విషయంలో రాజీ పడేలా కనిపించట్లేదు. సుమంత్ మార్కెట్ గురించి పట్టించుకోకుండా ఎక్కువ ఖర్చే చేయబోతున్నారు. కానీ సుమంత్‌‌ను నమ్మి బయటి నిర్మాతలు అంత ఖర్చు పెట్టే సాహసం ఎలా చేస్తారన్నది సందేహం. ఐతే ఈ చిత్రాన్ని పేరుకే బయటి నిర్మాతలు ప్రొడ్యూస్ చేస్తున్నారని.. ఇందులో మేజర్ ఇన్వెస్ట్‌మెంట్ సుమంత్‌దే అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘మళ్ళీ రావా’కు కూడా అదే జరిగిందని అంటున్నారు.

తన సొంత ప్రొడక్షన్లో సినిమా చేస్తే.. సుమంత్‌కు బయట అవకాశాలు లేవనుకుంటారని.. పైగా ఓన్ ప్రొడక్షన్లో చేస్తే కలిసిరాకపోవడాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని సుమంత్ ఇలా ప్లాన్ చేశాడని చెప్పుకుంటున్నారు. ఇప్పటిదాకా చిన్న సినిమాలతో లాక్కొచ్చేసిన సుమంత్ ఈసారి పెద్ద రిస్కే చేస్తున్నట్లు కనిపిస్తోంది. సంతోష్ జాగర్లమూడి అనే కొత్త దర్శకుడు ‘సుబ్రహ్మణ్యపురం’ను రూపొందించనున్నాడు. ఈషా రెబ్బా కథానాయిక.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు