చిరంజీవి.. రోడ్డు.. ఎప్పుడూ ఇదేనా సారూ?

చిరంజీవి.. రోడ్డు.. ఎప్పుడూ ఇదేనా సారూ?

చిరంజీవి కష్టపడి రోడ్డేశారు.. దాని మీద ఆ ఫ్యామిలీ వాళ్లంతా కారేసుకుని తిరుగుతున్నారు.. దాదాపు మూడేళ్ల నుంచి ఈ మాటలు వింటూనే ఉన్నాం. ఇప్పటికి ఆరేడు ఫంక్షన్లలో విని ఉంటాం ఈ మాటలు. మళ్లీ ‘రంగస్థలం’ ప్రి రిలీజ్ ఈవెంట్లోనూ అరిగిపోయిన ఈ రికార్డునే వల్లెవేశారు అల్లు అరవింద్. ఒక దశలో పవన్ కళ్యాణ్.. చిరును దాటి వెళ్లిపోయాడని.. చిరుకు గౌరవం తగ్గిపోతోందని.. పవన్ అభిమానులు సైతం శ్రుతి మించుతున్నారని భావన కలిగినపుడు అల్లు అరవింద్-అల్లు అర్జున్ కలిసి ఈ ‘రోడ్డు’ కాన్సెప్ట్ తెరమీదికి తెచ్చారు. ఇద్దరూ కలిసే ఈ కాన్సెప్ట్ తయారు చేశారో ఏమో కానీ.. మూడేళ్ల నుంచి ఏ వేదిక ఎక్కినా ఈ రోడ్డు కాన్సెప్ట్ చెప్పి ఊదరగొట్టేస్తున్నారు.

ఏ కొత్త కాన్సెప్ట్ అయినా తొలిసారి విన్నపుడు బాగానే అనిపిస్తుంది. రెండోసారికి ఓకేలే అనిపిస్తుంది. కానీ ప్రతిసారీ అదే కాన్సెప్ట్ వాయిస్తుంటే మొహం మొత్తేస్తుంది. ఇప్పుడు జనాల పరిస్థితి అదే. ఈ మధ్య పవన్ కళ్యాణ్ సైతం ట్రాక్‌లోకి వచ్చేశాడు. చిరుకు దగ్గరయ్యాడు. ఆయన మీద అమితమైన ప్రేమాభిమానాలు, గౌరవం ప్రదర్శిస్తున్నాడు. పవన్ అభిమానులు సైతం ‘పవర్ స్టార్’ నినాదాలు తగ్గించేశారు.

ఇక మెగా ఫ్యామిలీలో మిగతా ఎవ్వరూ చిరును ధిక్కరించే పరిస్థితుల్లో లేరు. అందరూ చిరుపై ఎనలేని గౌరవభావం చూపిస్తారు. మరి అల్లు వారు ఇప్పుడు ఎవరిని హెచ్చరిస్తున్నట్లు? ఇది హెచ్చిరక కాదు.. చిరు మీద తనకున్న గౌరవభావాన్ని చూపిస్తున్నారేమో అనుకుందామంటే.. మళ్లీ మళ్లీ వేదిక మీద ఈ మాట చెప్పడం ఆయనకు అవసరమా? అలా చెప్పి చిరును ఇంప్రెస్ చేయాలా? అన్నది సందేహం. ఏదేమైనా ఇక అల్లు వారు ఈ ‘రోడ్డు’ థియరీకి ఇక తెరదించితే బెటరేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు