‘యమలీల’ అసలు హీరోయిన్ ఆమేనట

‘యమలీల’ అసలు హీరోయిన్ ఆమేనట

తొంభైల్లో వచ్చిన చిన్న సినిమాల్లో పెద్ద విజయం సాధించిన చిత్రం ‘యమలీల’. తెలుగులో వచ్చిన అత్యుత్తమ కామెడీ చిత్రాల్లో ఇదొకటిగా నిలుస్తుంది. కమెడియన్‌ ఆలీ హీరోగా మారి చేసిన ఈ చిత్రం అతడి కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది.

ఈ చిత్రంలో ఆలీ సరసన ఇంద్రజ నటించిన సంగతి తెలిసిందే. ఐతే నిజానికి ఆ చిత్రానికి ముందు అనుకున్న కథానాయిక ఇంద్రజ కాదట. 90ల్లో యువతను ఒక ఊపు ఊపిన దివ్యభారతిని ఆ చిత్రానికి కథానాయికగా అనుకున్నారట. ఈ విషయంలో ఆలీకి దివ్యభారతి మాట కూడా ఇచ్చిందట. ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించాడు ఆలీ.

దివ్యభారతి చివరగా నటించిన ‘తొలి ముద్దు’లో ఆలీ ప్రశాంత్ స్నేహితుడిగా కనిపిస్తాడన్న సంగతి తెలిసిందే ఆ చిత్ర షూటింగ్ టైంలో దివ్యభారతితో పరిచయమై క్లోజ్ అయ్యానని.. తనకు హిందీ రావడంతో ఆమెకు డైలాగుల్లో సాయం చేసేవాడినని.. తన భుజం మీద చేయి వేసి చాలా సరదాగా మాట్లాడేదని.. తాను దివ్యా అని ఏకవచనంతో ఆమెను సంబోధించేవాడినని ఆలీ చెప్పాడు.

ఆ సందర్భంగానే ‘‘నువ్వు హీరో అయితే నీ పక్కన నేను నటిస్తానురా’’ అని దివ్యభారతి ఆలీతో అందట. దివ్యభారతి బతికి ఉంటే ‘యమలీల’లో ఆమే హీరోయిన్ అని.. ఐతే దురదృష్టవశాత్తూ ఆ చిత్రం ప్రారంభం కావడానికి కొన్ని రోజుల ముందే ఆమె చనిపోవడంతో ఇంద్రజను తీసుకోవాల్సి వచ్చిందని ఆలీ తెలిపాడు. చిరంజీవి.. వెంకటేష్ లాంటి స్టార్లతో నటించిన దివ్యభారతి ఆలీకి కథానాయికగా నటించడానికి ఒప్పుకుందంటే ఆశ్చర్యమే కదా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు