తేజను బాలయ్య ఎలా వదిలేస్తున్నాడబ్బా..

తేజను బాలయ్య ఎలా వదిలేస్తున్నాడబ్బా..

బాలయ్య కోసం ఎవరైనా ఆగాలి తప్ప.. ఆయన ఎవరి కోసం ఆగడనే పేరుంది ఇండస్ట్రీలో. తనకు ‘సింహా’.. ‘లెజెండ్’ లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చి మళ్లీ తన కెరీర్‌ను గాడిలో పెట్టిన బోయపాటి విషయంలో కూడా బాలయ్య రాజీ పడింది లేదు. నిజానికి బాలయ్య వందో సినిమాను బోయపాటే డైరెక్ట్ చేయాల్సింది. ఈ విషయంలో చాలా ముందే ఒప్పందం కుదిరింది. బాలయ్య ఫ్యాన్స్ కూడా అదే కోరుకున్నారు. కానీ బాలయ్య మాత్రం బోయపాటితో 100వ సినిమా చేయలేదు. ఇందుక్కారణం.. బోయపాటి కోసం ఎదురు చూడాల్సి రావడమే.

‘జయ జానకి నాయక’ విషయంలో ముందే కమిట్మెంట్ ఇచ్చిన బోయపాటి దాన్నుంచి ఫ్రీ కావడానికి సమయం పట్టేట్లుండటంతో బాలయ్య సడెన్‌గా క్రిష్ దర్శకత్వంలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ అనౌన్స్ చేసి చకచకా సినిమా కానిచ్చేశాడు. దీన్ని బట్టే బాలయ్య తీరు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అలాంటిది తేజ విషయంలో మాత్రం బాలయ్య సంయమనం పాటిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

తన తండ్రి జీవిత కథతో తెరకెక్కించబోయే సినిమాకు తేజను బాలయ్య దర్శకుడిగా ఎంచుకున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఈపాటికే మొదలు కావాల్సింది. కానీ వెంకటేష్‌తో తేజ చేయాల్సిన సినిమా వల్ల ఆలస్యమైంది. ఆ సినిమా కూడా అనుకున్న సమయానికి మొదలు కాలేదు. వెనక్కి వెనక్కి వెళ్తోంది. అది ముగించాక ఎన్టీఆర్ బయోపిక్ మీదికి వెళ్లాలని తేజ అనుకుంటున్నాడు. కానీ అది లేటవుతూ దీన్ని కూడా వెనక్కి తోసుకెళ్తోంది. ఐతే బాలయ్య తన సంక్రాంతి సెంటిమెంటును దృష్టిలో ఉంచుకుని ‘ఎన్టీఆర్’ సినిమాను 2019 పండక్కి రిలీజ్ చేయాలన్న పట్టుదలతో ఉన్నాడు.

కానీ తేజ తీరు చూస్తే.. వెంకీ సినిమా నుంచి ఎప్పుడు బయటికి వస్తాడో.. ఎన్టీఆర్ సినిమాను ఎప్పుడు మొదలుపెట్టి ఎలా గడువు లోపు పూర్తి చేస్తాడన్నది సందేహంగా ఉంది. ఇది మామూలు సినిమా అయితే రెండు మూడు నెలల్లో లాగించేయొచ్చు కానీ.. బయోపిక్.. పైగా కొన్ని దశాబ్దాల కిందటి వాతావరణం నేపథ్యంలో సినిమా తీయాలి. అది అంత సులువుగా.. వేగంగా అయ్యే పని కాదు. మరి ఈ పరిస్థితుల్లో తేజ ఏం చేస్తాడు.. బాలయ్యను ఎలా ఒప్పిస్తాడు.. మెప్పిస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు