సినిమా ఫ్లాప్.. అయినా కారు ఇచ్చాడు

సినిమా ఫ్లాప్.. అయినా కారు ఇచ్చాడు

సినిమా హిట్టయితే దర్శకుడికి హీరో కారు గిఫ్టుగా ఇవ్వడం అన్నది ఎప్పట్నుంచో చూస్తున్న సంప్రదాయమే. తనకు ‘శ్రీమంతుడు’ రూపంలో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టిచ్చిన కొరటాల శివకు మహేష్ బాబు కారు ఇచ్చాడు. ఇటీవలే ‘ఛలో’తో తనకు.. తన కుటుంబానికి మంచి విజయాన్నందించిన వెంకీ కుడుములకు నాగశౌర్య కూడా కారు బహుకరించాడు.

ఇప్పుడు తమిళ స్టార్ హీరో సూర్య కూడా తన చివరి సినిమా ‘తానా సేంద కూట్టం’ దర్శకుడు విఘ్నేశ్ శివన్ కు టయోటా కారు గిఫ్టుగా ఇచ్చాడు. కాకపోతే ఇక్కడ ట్విస్టు ఏంటంటే.. వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా హిట్టేమీ కాదు.

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘తానా సేంద కూట్టం’ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. వసూళ్లు జస్ట్ ఓకే అనిపించాయి. ఐతే ఈ చిత్రానికి భారీగా బిజినెస్ జరిగింది. బడ్జెట్ కూడా కొంచెం ఎక్కువే అయింది. ఆ ఖర్చుకు, అమ్మకాలకు తగ్గట్లుగా సినిమా వసూళ్లు రాబట్టలేకపోయింది. తెలుగులో పెట్టుబడి వెనక్కి వచ్చింది కానీ.. తమిళంలో అలా జరగలేదు. కమర్షియల్ లెక్కల్లో చూస్తే అంతిమంగా ఈ చిత్రం ఫ్లాప్ అని చెప్పాల్సిందే.

మరి అలాంటి ఫలితం ఇచ్చిన సినిమా విషయంలో సూర్య సొంత ఖర్చుతో విఘ్నేష్ కు కారు గిఫ్టివ్వడం విశేషమే. అందులోనూ ఈ చిత్రానికి సూర్య నిర్మాత కూడా కాకపోవడం గమనార్హం. మరి ‘తానా సేంద కూట్టం’ సూర్యకు అంతగా ఏం సంతోషాన్నిచ్చిందో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు