థియేటర్లలో ఇక సంబరాలేనా..

థియేటర్లలో ఇక సంబరాలేనా..

టాలీవుడ్ బాక్సాఫీస్‌లో ఎన్నడూ లేనంత స్లంప్ కనిపించింది ఈ మధ్య. అసలే పరీక్షల సీజన్. సరైన సినిమాలు లేవు. పైగా మధ్యలో ఒక వారం పాటు థియేటర్లు మూతపడ్డాయి. మొత్తంగా మూణ్నాలుగు వారాల నుంచి బాక్సాఫీస్ డల్లయిపోయింది. థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఐతే కొంత విరామం తర్వాత మళ్లీ ఈ శుక్రవారం నుంచి బాక్సాఫీస్ కళకళలాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ శుక్రవారం ఒకటికి నాలుగు సినిమాలు రిలీజవుతుండటం విశేషం. అందులో నిఖిల్ మూవీ ‘కిరాక్ పార్టీ’ ఎక్కువమంది దృష్టిని ఆకర్షిస్తోంది. సినిమాలకు మహరాజ పోషకులైన యువతకు మెచ్చేలా కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కడం కలిసొచ్చే విషయం.

రెగ్యులర్ మూవీ బఫ్స్ ఎలాగూ ఈ సినిమా కోసం ఆసక్తితో ఉన్నారు. ఇక ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయిన నేపథ్యంలో ఆ స్టూడెంట్స్ అందరి చూపూ ఈ సినిమా మీద ఉంటుంది. కాబట్టి ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వస్తాయని భావిస్తున్నారు. ఇక ఈ వారం విడుదల కాబోయే మిగతా సినిమాల్లో ఓ మోస్తరుగా జనాల్ని ఆకర్షించే అవకాశమున్న సినిమా ‘కర్తవ్యం’. నయనతార నటించిన ఈ డబ్బింగ్ సినిమా తమిళంలో మంచి విజయం సాధించింది. తెలుగులో ఈ చిత్ర ప్రివ్యూకు మంచి రెస్పాన్స్ వచ్చింది. పవన్ మాజీ మిత్రుడు శరత్ మరార్ ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నాడు. ఇక ‘ఐతే’ స్ఫూర్తితో తెరకెక్కిన ‘ఐతే 2.0’ మల్టీప్లెక్స్ ఆడియన్స్‌ను ఆకర్షించే అవకాశముంది. ‘దండుపాళ్యం’ సిరీస్‌లో వస్తున్న చివరి సినిమా ‘దండుపాళ్యం-3’ కూడా శుక్రవారమే విడుదలవుతోంది. ఈ చిత్రం కోసం ఓ వర్గం ప్రేక్షకులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మరి ఈ నాలుగు సినిమాలు మళ్లీ థియేటర్లలో సందడి తీసుకొస్తాయేమో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English