థియేటర్లు కట్టమంటున్న అమీర్ ఖాన్

థియేటర్లు కట్టమంటున్న అమీర్ ఖాన్

ఇండియన్ సినిమాకు చైనాలో తిరుగులేని ఫాలోయింగ్ తెచ్చిపెట్టిన హీరో అమీర్ ఖాన్. అతడి ‘దంగల్’ సినిమా అక్కడ రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అమీర్ అతిథి పాత్ర పోషించిన ‘సీక్రెట్ సూపర్ స్టార్’ సైతం రూ.500 కోట్ల మార్కును అందుకుంది చైనాలో. తన సినిమాలు చైనాలో ఈ స్థాయిలో ఆడేస్తుండటం పట్ల హర్షం ప్రకటించిన అమీర్.. చైనా లాగే భారతీయ సినిమా మార్కెట్‌ను కూడా పెంచడానికి మంచి అవకాశాలే ఉన్నాయని.. కానీ దానికి మంచి ప్లానింగ్.. ప్రభుత్వ సహకారం అవసరమని అన్నాడు. చైనా తర్వాత అత్యధిక జనాభా కలిగిన మన దేశంలో సినిమాను మరింతగా జనాల్లోకి తీసుకెళ్లే మార్గాలు చూడాలని అమీర్ అభిప్రాయపడ్డాడు.

చైనాలో సినిమా మార్కెట్ పెరగడంలో ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని.. దేశవ్యాప్తంగా స్వయంగా భారీ స్థాయిలో థియేటర్లు కట్టించిందని.. వేల కోట్ల పెట్టుబడులు పెట్టిందని.. దాని ఫలితంగా ప్రేక్షకులకు అత్యుత్తమ వినోదం అందేలా చూసిందని.. అందుకే అక్కడ పెద్ద మార్కెట్ ఏర్పడిందని అమీర్ చెప్పాడు. ఇండియాలో థియేటర్లు తక్కువని.. పైగా థియేటర్లలో సరైన వసతులు కూడా ఉండట్లేదని అమీర్ అన్నాడు. ఇక్కడ కూడా ప్రభుత్వం వినోద రంగంపై పెట్టుబడి పెట్టాలని.. థియేటర్లు కట్టించాలని.. వసతులు పెంచాలని.. ప్రైవేటు థియేటర్లు కూడా పెరగాల్సిన అవసరం ఉందని.. అప్పుడు ప్రేక్షకులు థియేటర్లకు పెద్ద ఎత్తున వస్తారని.. మన మార్కెట్ కూడా విస్తరిస్తుందని అమీర్ అభిప్రాయపడ్డాడు. మరి అమీర్ మాటల్ని పట్టించుకుంటారా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు