ఆ కెమెరామన్‌తో కళ్యాణ్ రామ్ మెగా ప్రాజెక్ట్

ఆ కెమెరామన్‌తో కళ్యాణ్ రామ్ మెగా ప్రాజెక్ట్

చాన్నాళ్ల తర్వాత ‘పటాస్’తో మాంచి హిట్టు కొట్టిన నందమూరి కళ్యాణ్ రామ్.. తర్వాత ఆ ఊపును కొనసాగించలేకపోయాడు. ‘షేర్’.. ‘ఇజం’ అతడికి తీవ్ర నిరాశను మిగిల్చాయి. కానీ ఆ సినిమాల ప్రభావం కళ్యాణ్ రామ్ కెరీర్ మీద పెద్దగా పడలేదు.

దీని తర్వాత ఒకటికి రెండు క్రేజీ ప్రాజెక్టుల్ని లైన్లో పెట్టాడు నందమూరి హీరో. అవే.. ఎమ్మెల్యే, నా నువ్వే. ఈ రెండు సినిమాలు రెండు నెలల వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. దీని తర్వాత కూడా కళ్యాణ్ రామ్ రెండు మూడు కమిట్మెంట్లు ఇవ్వడం విశేషం. అందులో పవన్ సాధినేని దర్శకత్వంలో చేయబోయే సినిమా ఒకటి.

ఇది కాక తాజాగా కళ్యాణ్ రామ్ సొంత బేనర్లో ఒక సినిమా చేయడానికి రంగం సిద్ధం చేశాడు. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు రూపొందించబోతున్నాడు. ఐతే అతను దర్శకుడిగా కొత్త కానీ.. ఇండస్ట్రీకి కొత్త కాదు. తెలుగులో ‘ఆర్య’.. ‘జల్సా’.. ‘దూకుడు’.. ‘ఆగడు’ లాంటి పెద్ద సినిమాలతో పాటు తమిళం, హిందీ భాషల్లోనూ కెమెరామన్‌గా పని చేసిన  కె.వి.గుహన్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నటించబోతున్నాడు.

‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బేనర్ మీద ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇది భారీ బడ్జెట్లో తెరకెక్కే ప్రయోగాత్మక చిత్రమని చెబుతున్నారు. ఇప్పటికే స్క్రిప్టు రెడీ అయిందట. ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ‘నా నువ్వే’ రిలీజయ్యాక, ఈ ఏడాది ద్వితీయార్దంలో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు