జపాన్‌లో బాహుబలి.. ఏం క్రేజ్ బాబోయ్

జపాన్‌లో బాహుబలి.. ఏం క్రేజ్ బాబోయ్

కొన్నేళ్ల కిందటి వరకు మన సినిమా వేరే దేశంలో విడుదల కావడమే పెద్ద విషయంగా ఉండేది. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితులు మారాయి. మన కంటే ముందుగా విదేశాల్లో మన సినిమాను చూసేస్తున్నారు జనాలు. ఐతే ఇండియన్ సినిమా ఎక్కడ విడుదలైనా చూసేది ఇండియన్ ప్రేక్షకులే అనే విషయం గుర్తుంచుకోవాలి.

హాలీవుడ్ సినిమాల్ని మనం చూసినట్లుగా.. మన సినిమాల్ని వేరే దేశాల ప్రేక్షకులు చూడటమే గొప్ప విషయం. ఈ విషయంలో ‘బాహుబలి’.. ‘దంగల్’ లాంటి సినిమాలు కొత్త ఒరవడి సృష్టించాయి. ‘బాహుబలి: ది బిగినింగ్’ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొత్త ప్రేక్షకుల్ని ఇండియన్ సినిమా వైపు ఆకర్షించింది. ‘దంగల్’ చైనీయుల్ని ఉర్రూతలూగించింది.

‘బాహబలి-1’ వేసిన పునాది మీద ‘బాహుబలి-2’ ప్రపంచ ప్రేక్షకులకు మరింతగా చేరువైంది. ఈ చిత్రం పలు దేశాల్లో ప్రేక్షకుల్ని అలరించింది. రెండు నెలలుగా జపాన్‌ ప్రేక్షకులకు ఈ సినిమా పిచ్చెక్కించేస్తోంది. వాళ్లు థియేటర్లలో ఈ సినిమాను ఆస్వాదిస్తున్న తీరు చూస్తే మనం కూడా ఆ స్థాయిలో ఆ సినిమాను ఎంజాయ్ చేసి ఉండవేమో అనిపిస్తోంది.

తాజాగా ‘బాహుబలి-2’ చూస్తూ జపాన్ ప్రేక్షకులు థియేటర్లో స్పందిస్తున్న తీరును చూపిస్తూ ఒక వీడియో బయటికి వచ్చింది. ఈ సినిమాలోని భళి భళి భళిరా భళి పాట వస్తున్నపుడు చేతిలో లైట్లు పట్టుకుని లయబద్ధంగా ఆడిస్తూ.. కోరస్ పాడుతూ జపాన్ ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్ చేస్తున్న తీరు ఔరా అనిపిస్తోంది. ఆ దృశ్యం మన జనాలకు మతి పోగొట్టేసేదే. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జపాన్ ప్రేక్షకుల్ని ‘బాహుబలి’ ఏ స్థాయిలో అలరిస్తోందో చెప్పడానికి ఇది ఒక రుజువు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు