‘లగాన్’ దర్శకుడి మరో భారీ ప్రయత్నం

‘లగాన్’ దర్శకుడి మరో భారీ ప్రయత్నం

ఈ రోజుల్లో చరిత్ర పుస్తకాలు చదివేవాళ్లు తగ్గిపోయారు. చరిత్ర గురించి కొత్త తరాలకు చెప్పే వేదికలూ తగ్గిపోయాయి. ఇలాంటి తరుణంలో చరిత్రను ఎక్కువమంది జనాల దగ్గరికి తీసుకెళ్లడానికి అత్యంత ఆకర్షణీయమైన మార్గం సినిమానే. దృశ్యరూపంలో ఆకర్షణీయంగా చెబితేనే చరిత్రను జనాలు చూస్తారు. దాని గురించి చర్చిస్తారు. ఇలా చరిత్ర నేపథ్యంలో సినిమాలు తీయడానికి తపించే భారతీయ దర్శకుల్లో అశుతోష్ గోవారికర్ ముందుంటాడు. తొలి సినిమా ‘లగాన్’ దగ్గర్నుంచి చరిత్రలోంచి ఏవో కొన్ని ఘట్టాల్ని.. అప్పటి జనాల జీవితాల్ని చూపించాలనే ప్రయత్నమే చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి కొన్ని ఎదురు దెబ్బలు తగిలినా వెనుకంజ వేయలేదు.

జోదా అక్బర్.. మొహెంజదారో.. ఈ రెండూ కూడా చరిత్ర నేపథ్యంలో తెరకెక్కినవే. చివరగా ఆయన తీసిన ‘మొహెంజదారో’ దారుణమైన ఫలితాన్నందించింది. అయినప్పటికీ అశుతోష్ వెనక్కి తగ్గలేదు. ఇప్పుడాయన భారత దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన పానిపట్ యుద్ధం నేపథ్యంలో సినిమా తీస్తున్నాడు. ఈ చిత్రానికి ‘పానిపట్’ అని పేరు పెట్టాడు. ఎప్పట్లాగే ఈ చిత్రాన్ని కూడా అశుతోష్ స్వీయ నిర్మాణంలోనే తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో సంజయ్ దత్.. అర్జున్ కపూర్.. కృతిసనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ రోజే ఈ చిత్ర ప్రి లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. యుద్ధ పతాకం.. కరవాలం.. బ్యాగ్రౌండ్లో సైనికలు.. ఈ సెటప్ అంతా చూస్తే ఇది పూర్తిగా యుద్ధ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా అనే విషయం స్పష్టమవుతోంది. మరి ఈ చిత్రంతో అశుతోష్ ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English