మళ్లీ రీమేక్‌ను నమ్మకుంటున్నాడట

మళ్లీ రీమేక్‌ను నమ్మకుంటున్నాడట

హిట్టు కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాడు సందీప్ కిషన్. వేర్వేరు జానర్లలో ట్రై చేశాడు. కొత్త, పాత దర్శకుల్ని నమ్ముకున్నాడు. స్ట్రెయిట్ సినిమాలతో పాటు రీమేక్‌లూ ట్రై చేశాడు. ద్విభాషా చిత్రాల్లోనూ నటించాడు. కానీ ఏదీ అతడికి సరైన ఫలితాన్నివ్వడం లేదు. చివరగా అతను నటించిన ‘మనసుకు నచ్చింది’ సినిమాకు కనీస ఓపెనింగ్స్ లేవు. ఆ సినిమా వచ్చింది తెలియదు. వెళ్లింది తెలియదు. సందీప్ మార్కెట్ ఏ స్థాయిలో పడిపోయిందో ఈ సినిమాతో మరోసారి రుజువైంది. తమిళంలో అయినా అతడి కెరీర్ పర్వాలేదు కానీ.. తెలుగులో మాత్రం పరిస్థితి దయనీయంగా ఉంది. ఇలాంటి సమయంలో సందీప్‌కు ఇక్కడ ఇంకో అవకాశం దక్కడం సందేహంగానే ఉంది.

ఐతే సందీప్ ఎలాగోలా ఒక నిర్మాతను సెట్ చేసుకుని ఒక సినిమా చేయడానికి రెడీ అవతున్నట్లు సమాచారం. నిర్మాత వివరాలు బయటికి రాలేదు కానీ.. శ్రీరామ్ అనే కొత్త దర్శకుడితో ఈ చిత్రం చేస్తాడట. ఈ చిత్రం ఒక తమిళ హిట్ మూవీకి రీమేక్ అని సమాచారం. ‘తమిళంలో నాలుగేళ్ల కిందట వచ్చిన ‘ఇండ్రు నేట్రు నాలై’ అనే సినిమాను తెలుగులోకి తేవాలని చూస్తున్నాడట సందీప్. ఇది టైం మెషీన్ నేపథ్యంలో సాగే కామెడీ మూవీ. తమిళంలో విష్ణు విశాల్ కథానాయకుడిగా నటించాడు. ‘ఉంగరాల రాంబాబు’ హీరోయిన్ మియా జార్జ్ కథానాయికగా నటించింది. తమిళంలో ఈ సినిమా మంచి విజయమే సాధించింది. మరి ఈ చిత్రం తెలుగులో సందీప్‌కు ఎలాంటి ఫలితాన్నందిస్తుందో చూడాలి. ఇంతకుముందు అతను ‘నేరం’ అనే తమిళ హిట్‌కు రీమేక్‌గా వచ్చిన ‘రన్’లో నటించాడు కానీ.. అది అతడికి తీవ్ర నిరాశను మిగిల్చింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English