బెల్లంకొండ.. విలన్ల విషయంలోనూ రేంజేనా?

బెల్లంకొండ.. విలన్ల విషయంలోనూ రేంజేనా?

కెరీర్ ఆరంభం నుంచి పెద్ద పెద్ద దర్శకులతో సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్లతో జత కడుతూ.. పెద్ద రేంజికి వెళ్లిపోవాలని తెగ తాపత్రయ పడుతున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఇప్పటికే అతను వి.వి.వినాయక్, బోయపాటి శ్రీను, శ్రీవాస్ లాంటి పెద్ద డైరెక్టర్లతో.. సమంత, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డే లాంటి స్టార్ హీరోయిన్లతో ఆడిపాడాడు. అతను ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో నటించిన మిగతా నటీనటులు కూడా పెద్ద స్థాయి వాళ్లే. విలన్ల విషయంలో కూడా అతను రాజీ పడేదే లేదు. ఆ విషయంలోనూ ఒక రేంజ్ మెయింటైన్ చేస్తుంటాడు . కెరీర్లో తొలిసారిగా అతను శ్రీనివాస్ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేయడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే.

ఇందులో విలన్ పాత్రకు బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముకేశ్‌ను ఎంచుకున్నట్లు సమాచారం. బాలీవుడ్లో హీరోగా నటించిన నీల్ నితిన్.. దక్షిణాదిన మాత్రం విలన్ పాత్రలు చేస్తున్నాడు. విలన్‌గా అతడి తొలి సినిమా ‘కత్తి’ బ్లాక్ బస్టర్ అయింది. దీని తర్వాత ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘సాహో’లో ప్రతినాయక పాత్ర చేస్తున్నాడు. ఆ రేంజి విలన్ని బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా కోసం తీసుకున్నారట. దర్శకులు, హీరోయిన్ల విషయంలోనే కాక విలన్ల విషయంలోనూ రేంజ్ మెయింటైన్ చేయడానికి శ్రీనివాస్ ప్రయత్నిస్తుండటం చర్చనీయాంశమవుతోంది. ఈ చిత్రానికి దర్శకుడు కొత్తవాడు అయినప్పటికీ మిగతా సెటప్ అంటే భారీగా ఉండేలా చూసుకుంటున్నారట. ఇందులో ఒక స్టార్ హీరోయిన్ నటిస్తుందని సమాచారం. ఎప్పట్లాగే ఈ చిత్రాన్ని బయటి నిర్మాతతోనే చేస్తున్నప్పటికీ ఫినాన్షియల్ బ్యాకప్ మాత్రం శ్రీనివాస్ తండ్రి సురేషే అందిస్తున్నట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు