ఆ దర్శకుడికి మళ్లీ నాని ఛాన్స్?

ఆ దర్శకుడికి మళ్లీ నాని ఛాన్స్?

యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ వాయిస్ ఓవర్ కోసం అడగడానికి తనను కలిస్తే కథ నచ్చేసి ‘అ!’ సినిమాను స్వయంగా తనే ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చాడు నాని. ఆ తర్వాత కథంతా జనాలకు తెలిసిందే. మిశ్రమ స్పందన తెచ్చుకున్న ‘అ!’ కమర్షియల్‌గా పర్వాలేదనిపించింది. నాని పెట్టుబడిని వెనక్కి తెచ్చిపెట్టింది. దీంతో ప్రశాంత్ మీద మరింతగా గురి కుదిరి అతడితో మరో సినిమా చేయడానికి నాని రెడీ అయినట్లు సమాచారం. ‘అ!’ తరహాలోనే మరో విభిన్నమైన కథతో ప్రశాంత్ తన రెండో సినిమా చేయబోతున్నాడట. ఈసారి నానినే అందులో కథానాయకుడిగా నటిస్తాడట. నాని సొంత బేనర్లోనే ఈచిత్రం తెరకెక్కే అవకాశముంది.

తన దగ్గర 30 దాకా కొత్త కథలు ఉన్నాయని.. చిరంజీవి-బాలకృష్ణ కాంబినేషన్లో మల్టీస్టారర్ చేయాలనుందని ‘అ!’ విడుదల తర్వాత ప్రకటించి ఆశ్చర్యపరిచాడు ప్రశాంత్. ఐతే ‘అ!’ తర్వాత అతడికి బయటి నుంచి ఏమేరకు అవకాశాలొచ్చాయో ఏమో కానీ.. నానితోనే తన రెండో సినిమా చేయడం మాత్రం ఖరారైంది. ప్రస్తుతం నాని మామూలు ఊపులో లేడు. మూడేళ్లుగా వరుసబెట్టి సక్సెస్‌లు చూస్తున్న నాని.. ఈ ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించే అవకాశముంది. ముందుగా ఏప్రిల్ 12న ‘కృష్ణార్జున యుద్ధం’ విడుదలవుతుంది. ఆ తర్వాత నాగార్జునతో చేసే మల్టీస్టారర్‌తో పాటు మరో సినిమాను ఈ ఏడాది ద్వితీయార్ధంలో రిలీజ్ చేయించే ప్లాన్లో ఉన్నాడు నాని.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు