‘క్షణం’ మొత్తం మార్చేయమన్నారట


అడివి శేష్ కెరీర్లో గేమ్ చేంజర్‌గా నిలిచిన చిత్రం ‘క్షణం’. అప్పటిదాకా శేష్‌కు కెరీర్లో చాలా వరకు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. స్వీయ దర్శకత్వంలో తీసిన కర్మ, కిస్ చిత్రాలు దారుణమైన ఫలితాలను అందించగా.. నటుడిగా కూడా అతడికి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ‘క్షణం’తో రచయితగా, నటుడిగా అద్భుతమైన పనితనం చూపించి ప్రేక్షకుల మనసు దోచాడు శేష్. కొత్త దర్శకుడు రవికాంత్ పేరెపుతో కలిసి అతను పడ్డ కష్టానికి బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితమే దక్కింది. పెద్ద చిత్రాలకు పేరుపడ్డ పీవీపీ.. ఈ చిన్న చిత్రాన్ని ప్రోత్సహించి తన అభిరుచిని చాటుకున్నారు.

ఐతే సినిమా పట్టాలెక్కడానికి ముందు మాత్రం శేష్ చాలానే కష్టపడాల్సి వచ్చిందట. ఒకపట్టాన ఈ కథకు గ్రీన్ సిగ్నల్ లభించలేదట. ఒక టైంలో ‘క్షణం’ కథ మొత్తం మార్చేయాలన్న సూచన పీవీపీ టీంలోని ఒకరి నుంచి వచ్చినట్లు శేష్ తాజాగా ఒక టీవీ కార్యక్రమంలో వెల్లడించాడు.

“క్షణం కథా చర్చలు నడుస్తున్న సమయంలో ఒక రోజు పీవీపీ గారు వచ్చి నా స్నేహితులు కొందరున్నారు. వారికి కథ వినిపించండి. వాళ్లు ఓకే అంటే షూట్‌కు వెళ్లిపోదాం అన్నారు. పీవీపీ గారి ఆఫీసులో వారితో కలిసి నేను, రవికాంత్ కూర్చున్నాం. చాలా ఉత్సాహంగా కథ చెప్పాను. స్క్రీన్ ప్లే వివరిస్తుంటే.. వారిలో కొందరు ఇక్కడ కొంచెం మారిస్తే సరిపోతుంది. ఈ సీన్లో ఇది బాగాలేదు. మిగతా అంతా ఓకే అంటూ అభిప్రాయాలు చెబుతున్నారు. కానీ ఒకతను మాత్రం మొత్తం స్క్రిప్టు మార్చేయాలి అన్నాడు. ఒక్కసారిగా నా గుండె జారిపోయింది.

ఏడు నెలల కష్టం బూడిదలో వేసినట్లయిందని నేను, రవి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నాం. మా ముఖాలు పాలిపోయాయి. పీవీపీ గారు కూడా ఈ సినిమా మనం చేయాలా అన్నట్లు చూశారు. తర్వాత ఆయన, నిరంజన్ రెడ్డి బయటికి వెళ్లారు. మమ్మల్ని ఎలా బయటికి పంపించాలని అని మాట్లాడుకుంటున్నారేమో అనుకున్నాం. కానీ ఇద్దరూ లోపలికి వచ్చాక ఈ సినిమా చేస్తున్నామని, తాను 50 శాతం పెట్టుబడి పెడతానని నిరంజన్ రెడ్డి అన్నారు. దీంతో ఒక్కసారిగా పోయిన ప్రాణం తిరిగొచ్చింది’’ అని శేష్ తెలిపాడు. కోటి రూపాయల బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో పది కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడమే కాదు.. తమిళం, హిందీ భాషల్లోనూ రీమేక్ అయింది.