కొత్త సినిమాల్లేవ్.. పాతవి ఫుల్లు

కొత్త సినిమాల్లేవ్.. పాతవి ఫుల్లు

ప్రతి వారం కొత్త సినిమాల కోసం తహతహలాడే మూవీ బఫ్స్‌కు ఇప్పుడు కష్ట కాలం నడుస్తోంది. కొన్ని వారాలుగా చెప్పుకోదగ్గ సినిమాలే రిలీజవ్వడం లేదు. మధ్యలో ఒక వారం అసలు సినిమాలన్నవే విడుదల కాకపోగా.. దానికి ముందు వారం.. తర్వాతి వారంలో రిలీజైన సినిమాలు నామమాత్రమే అయ్యాయి. వీటికి ఏమాత్రం ఆదరణ లేకపోయింది. దీంతో ప్రేక్షకులకు పాత సినిమాలే దిక్కయ్యాయి. ఎప్పుడో నెలా నెలన్నర ముందు రిలీజైన సినిమాలు ఇప్పటికీ మంచి వసూళ్లే రాబడుతుండటం విశేషం. మామూలుగా ఒక కొత్త సినిమాకు ఎంత మంచి టాక్ వచ్చినా.. అది ఎంత పెద్ద సినిమా అయినా.. రెండు మూడు వారాల తర్వాత బాక్సాఫీస్ దగ్గర నిలవడం కష్టం.

కానీ ప్రస్తుత ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం పాత సినిమాలే బాక్సాఫీస్‌కు ఎంతో కొంత కళ తెస్తున్నాయి. మార్చి తొలి వారంలో సమ్మె రావడానికి ముందు ‘తొలి ప్రేమ’ బాక్సాఫీస్ లీడర్‌గా ఉంది. దానికి దీటుగా ‘ఛలో’ కూడా మంచి వసూళ్లే సాధిస్తూ సాగింది. ఐతే వాటికి సమ్మె బ్రేక్ వేసింది. అంతటితో వాటి థియేట్రికల్ రన్ ముగిసినట్లే అనుకున్నారు. కానీ వారం తర్వాత థియేటర్లు తెరుచుకున్నాయి. ఈ వారం వచ్చిన కొత్త సినిమాలు ‘ఏ మంత్రం వేసావె’.. ‘కోటికొక్కడు’ ఏమాత్రం ప్రభావం చూపలేదు. దీంతో ప్రేక్షకులు మళ్లీ ‘తొలి ప్రేమ’.. ‘ఛలో’ల వైపే చూశారు. వీకెండ్లో ఈ సినిమాలకు చాలా చోట్ల ఫుల్స్ పడటం విశేషం. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఈ సినిమాలు ఆడుతున్న థియేటర్లు శని, ఆదివారాల్లో మంచి వసూళ్లు రాబట్టాయి. ఫస్ట్ షో, సెకండ్ షోలకు థియేటర్లు నిండిపోయాయి. హైదరాబాద్ సిటీలో మిగతా చోట్ల.. రెండు తెలుగు రాష్ట్రాల్లో మిగతా నగరాలు, పట్టణాల్లోనూ ఈ రెండు సినిమాలు చెప్పుకోదగ్గ సంఖ్యలో థియేటర్లలో కొనసాగుతున్నాయి. ఓ మోస్తరు వసూళ్లు సాగిస్తున్నాయి. ఈ వీకెండ్లో ‘కిరాక్ పార్టీ’ వచ్చే వరకు ఇవి ఎంతో కొంత షేర్ సాధిస్తూనే ఉంటాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు