శృతిమించిన నిర‌స‌న‌.. మండ‌లి ఛైర్మ‌న్ కంటికి గాయం

శృతిమించిన నిర‌స‌న‌.. మండ‌లి ఛైర్మ‌న్ కంటికి గాయం

మితంగా ఉంటే ఏదైనా బాగుంటుంది. హ‌ద్దులు దాటే ఆవేశం ఏ మాత్రం మంచిది కాదు. తాజాగా తెలంగాణ అసెంబ్లీలో చోటు చేసుకున్న అనూహ్య ప‌రిణామం ఉద్రిక్త‌త‌ను సృష్టించ‌టమే కాదు.. విప‌క్ష నేత‌లు విమ‌ర్శ‌లు పాల‌య్యేలా చేసింది. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగాన్ని అడ్డుకునే క్ర‌మంలో శృతి మించిన నిర‌స‌న కార‌ణంగా మండ‌లి ఛైర్మ‌న్ స్వామిగౌడ్ కంటికి గాయ‌మైన ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది.

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కావ‌టం తెలిసిందే. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్ర‌య‌త్నించారు. ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించి నిర‌స‌న తెలిపారు. వెల్ లోకి దూసుకెళ్లేందుకు ప్ర‌య‌త్నించారు. త‌మ నిర‌స‌న‌లో భాగంగా బ‌డ్జెట్ ప్ర‌సంగ ప్ర‌తుల్ని చించి వెల్ పైకి విసిరేశారు.

స‌భ‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ప్ర‌సంగిస్తున్న స‌మ‌యంలో కాంగ్రెస్ సీనియ‌ర్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఆవేశంతో త‌న హెడ్ ఫోన్స్ విసిరేశారు. అనూహ్యంగా హెడ్ ఫోన్స్ వెళ్లి స్వామిగౌడ్ ను తాకాయి. ఆయ‌న కంటికి స్వ‌ల్ప గాయ‌మైంది. దీంతో.. స‌భ‌లో ఒక్క‌సారిగా ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.

కంటికి గాయ‌మైన స్వామిగౌడ్ ను హుటాహుటిన స‌రోజినీదేవి కంటి ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆయ‌న కన్ను కొద్దిగా వాపు రావ‌టంతో ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. స్వామిగౌడ్‌ను ప‌రామ‌ర్శించేందుకు ఆసుప‌త్రికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప‌య‌న‌మ‌య్యారు.

ఊహించ‌ని రీతిలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న‌కు స‌భ‌లోని స‌భ్యులంతా షాక్ తిన్నారు. కోమ‌టిరెడ్డి చ‌ర్య‌ను ప్ర‌భుత్వం సీరియ‌స్ గా తీసుకుంది. స‌భ‌లో భౌతిక‌దాడి కింద‌కు తాజా ప‌రిణామం వ‌స్తుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మంగ‌ళ‌వారం జ‌రిగే స‌భ‌లో కోమ‌టిరెడ్డి మీద చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. తాజా ప‌రిణామంతో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగాన్ని అడ్డుకోవాల‌ని చూసినా.. స‌మావేశాలకు ఆటంకం క‌లిగించాల‌ని చూసినా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఆవేశం ఉండాలే కానీ.. అది అంద‌రూ ఆమోదించేలా ఉండాల‌న్న చిన్న విష‌యాన్ని కోమ‌టిరెడ్డి ఎందుకు మ‌ర్చిపోయార‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English