అఖిల్ సినిమా పక్కా అంటే పక్కా

అఖిల్ సినిమా పక్కా అంటే పక్కా

తన తొలి సినిమాతో పాటు రెండో సినిమా విషయంలోనూ తర్జన భర్జనలు పడ్డాడు అక్కినేని అఖిల్. ఎంత ఆచితూచి అడుగులేసినా ఫలితం లేకపోయింది. ‘అఖిల్’తో పాటు ‘హలో’ కూడా అతడికి నిరాశనే మిగిల్చింది. ‘హలో’ బాగా ఆడితే.. ముందు అనుకున్నట్లే ‘మలుపు’ ఫేమ్ సత్య ప్రభాస్ పినిశెట్టి దర్శకత్వంలో తన మూడో సినిమా చేసేవాడేమో అఖిల్. కానీ ‘హలో’ తేడా కొట్టడంతో రిస్క్ చేయలేకపోయాడు. ‘తొలి ప్రేమ’తో తొలి ప్రయత్నంలోనే మంచి విజయాన్నందుకున్న వెంకీ అట్లూరితో సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. నిన్న మొన్నటి దాకా ఈ సినిమా విషయంలో కొంచెం సందేహాలున్నాయి. ఇప్పుడవన్నీ పటాపంచలైపోయాయి.

అఖిల్‌తో వెంకీ చేయబోయే సినిమాకు కథ ఓకే అయిపోయి.. ప్రి ప్రొడక్షన్ పనులు కూడా మొదలైపోయాయి. లొకేషన్ల వేట కోసం ఇంకొన్ని రోజుల్లోనే వెంకీ బ్యాంకాక్‌కు తన టీంతో కలిసి వెళ్లబోతున్నాడు కూడా. ఈ చిత్రానికి నిర్మాత కూడా ఖరారయ్యాడు. వెంకీతో ‘తొలి ప్రేమ’ తీసిన సీనియర్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాదే ఈ చిత్రాన్ని కూడా నిర్మించనున్నాడు. ప్రసాద్‌తో తన తర్వాతి సినిమాను కూడా చేసేలా ముందే కమిట్మెంట్ ఇచ్చాడు వెంకీ. హీరోగా అఖిల్ ట్రాక్ రికార్డు బాగా లేనప్పటికీ అతడితో వెంకీ సినిమాను నిర్మించడానికి ప్రసాద్ ఓకే అన్నట్లు తెలిసింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఇంకో రెండో నెలల్లో సినిమా సెట్స్ మీదికి వెళ్తుందని సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు