కన్ను గీటిన పిల్ల.. ‘టెంపర్’ రీమేక్ లో?

కన్ను గీటిన పిల్ల.. ‘టెంపర్’ రీమేక్ లో?

కేవలం 30 సెకన్ల వీడియోతో కోట్లాది మందికి చేరువైపోయింది మలయాళ టీనేజర్ ప్రియ ప్రకాష్ వారియర్. ‘ఒరు అడార్ లవ్’ సినిమాలో ఆమె కన్నుగీటే వీడియో యువతను విశేషంగా ఆకట్టుకుంది. ఆమెకు తిరుగులేని పాపులారిటీ తెచ్చిపెట్టింది.

ప్రియ తొలి సినిమా కోసం ఇప్పుడు కోట్లాది మంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రేజ్ చూసుకుని ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు వేరే భాషల్లో కూడా రిలీజ్ చేయాలనే ప్రణాళికలో ఉంది చిత్ర బృందం. మరోవైపు ప్రియ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు వివిధ భాషల నుంచి ఆమెకు దర్శక నిర్మాతల నుంచి ఆఫర్లు కూడా వెల్లువెత్తుతున్నట్లు వార్తలొస్తున్నాయి.

నిఖిల్ కొత్త సినిమాలో ప్రియనే కథానాయికగా తీసుకోవాలనుకున్నారట కానీ.. ఆమెకు వీలు కాలేదు. జూన్ వరకు తనకు ఖాళీ లేదని అంటోంది. ఐతే ఆ తర్వాత ఆమె ఒక క్రేజీ బాలీవుడ్ సినిమాలో నటించబోతున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ సినిమా మరేదో కానీ.. ‘టెంపర్’ బాలీవుడ్ రీమేక్ ‘సింబా’. ఈ చిత్రం కోసం కథానాయికగా పలు పేర్లు వినిపించాయి.

ఐతే ఇప్పుడు ఈ చిత్ర నిర్మాత కరణ్ జోహార్.. దర్శకుడు రోహిత్ శెట్టిల కళ్లు ప్రియ మీద పడ్డట్లుగా బాలీవుడ్ మీడియా చెబుతోంది. ప్రియ ఓకే అంటే ఈ సినిమాలో ఆమెనే కథానాయిక అవుతుందట. సోషల్ మీడియా పుణ్యమా అని ప్రియకు ఉత్తరాదిన కూడా మంచి ఫాలోయింగే వచ్చింది. మరి ప్రియ నిజంగానే ఈ సినిమాలో నటిస్తుందేమో చూడాలి. ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు