సీనియర్ లిరిసిస్టు.. చెలరేగిపోయాడుగా

సీనియర్ లిరిసిస్టు.. చెలరేగిపోయాడుగా

తెలుగు చిత్ర సీమలో వేటూరి సుందరరామమూర్తి, సీతారామశాస్త్రిల తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న గీత రచయిత చంద్రబోస్. 90ల మధ్య నుంచి ఓ దశాబ్దం పాటు చంద్రబోస్ హవా సాగింది. అప్పట్లో ఆయనే నంబర్ వన్ లిరిసిస్టు. కానీ గత దశాబ్దంలో చంద్రబోస్ జోరు తగ్గింది.

అనంత్ శ్రీరామ్, రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి లాంటి లిరిసిస్టులు లీడ్ తీసుకున్నాక చంద్రబోస్‌కు ఇంతకుముందులా అవకాశాలు దక్కలేదు. ఎప్పుడో ఒక పాట తప్పితే ఇంతకుముందులా ఉద్ధృతంగా పాటలు రాయట్లేదాయన. గత గత ఏడాది ‘నేను లోకల్’.. ‘జై లవకుశ’.. ‘హలో’.. లాంటి సినిమాల్లో ఒక్కో పాటతో మెరిశారు చంద్రబోస్. ఐతే గతంలో లాగా బోస్ సింగిల్ కార్డ్ అనేది అరుదైపోయింది.

ఐతే కొత్త ఏడాదిలో ఇప్పుడు చంద్రబోస్ పేరు మార్మోగిపోతోంది. సుకుమార్-రామ్ చరణ్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రంగస్థలం’ కోసం తన పెన్ ప్రతాపం చూపించాడు చంద్రబోస్. ఎంత సక్కగున్నావే అంటూ ఈ సినిమా కోసం బోస్ రాసిన పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ మధ్య కాలంలో వచ్చిన ఉత్తమ పాటగా అది గుర్తింపు పొందింది. ఇదే సినిమాలో ‘రంగా రంగా రంగస్థలాన’... ‘రంగమ్మ మంగమ్మ’ పాటలతోనూ బోస్ తనదైన ముద్ర వేశాడు. ఈ పాటల్లో కూడా లిరిక్స్ గురించి చర్చ నడిచింది.

సరళమైన పదాలతో.. ఆకర్షణీయమైన పంక్తులతో క్యాచీగా ఉండేలా పాటలు రాశాడు చంద్రబోస్. ఆడియోలోని మిగతా పాటలు కూడా బోసే రాసినట్లు సమాచారం. చాన్నాళ్ల తర్వాత సింగిల్ కార్డ్ పడటం.. అందులోనూ తన సాహిత్యానికి మంచి పేరు వస్తుండటంతో బోస్ చాలా సంతోషంగా కనిపిస్తున్నాడు. ఆయన కెరీర్‌కు ఈ సినిమా మంచి ఊపునిస్తుందనడంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English