నిఖిల్ సినిమాకు ఎన్ని కావాలంటే అన్ని

నిఖిల్ సినిమాకు ఎన్ని కావాలంటే అన్ని

తెలుగు ప్రేక్షకులకు ఎన్నడూ లేనంత కరువు వచ్చిపడింది. మూడు వారాలుగా థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలే లేవు. మధ్యలో ఒక వారం అసలు సినిమాలే రిలీజవ్వలేదు. దానికి ముందు వారం.. తర్వాతి వారం వచ్చిన సినిమాలు నామమాత్రమే. అవి జనాల్ని ఏమాత్రం ఆకర్షించడం లేదు.

విద్యార్థులకు పరీక్షల సీజనే కానీ.. రెగ్యులర్ సినీ గోయర్స్‌కు ఏ సీజన్ అయినా ఒకటే. ప్రతి వారం సినిమా మిస్ కాని జనాలు లక్షల్లోనే ఉంటారు. అలాంటి వాళ్లు సరైన సినిమా కోసం ఆవురావురుమని ఉన్నారు. వచ్చే వారం వాళ్ల కోసమే ఆసక్తి రేకెత్తించే సినిమా వస్తోంది. అదే.. నిఖిల్ హీరోగా నటించిన కిరాక్ పార్టీ.

ఈ చిత్రంపై ముందు నుంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాను నిఖిల్ కెరీర్లోనే అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. మామూలుగా ఈ స్థాయి సినిమాలకు ఆశించిన స్థాయిలో థియేటర్లు దొరకవు. కానీ ‘కిరాక్ పార్టీ’ విషయంలో అలా లేదు. ఎగ్జిబిటర్లే థియేటర్లివ్వడానికి పోటీ పడే పరిస్థితి కనిపిస్తోంది. సరైన సినిమా లేక థియేటర్లు వెలవెలబోతున్నాయిప్పుడు. చాలా ఏళ్లుగా మరుగున పడి ఉన్న విజయ్ దేవరకొండ సినిమా ‘ఏ మంత్రం వేసావె’కే 600 దాకా స్క్రీన్లు ఇచ్చారంటే థియేటర్ల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

‘కిరాక్ పార్టీ’పై అంచనాలు బాగున్నాయి కాబట్టి మరింత ఎక్కువ సంఖ్యలో థియేటర్లు ఇవ్వనున్నారు. లెక్క 1000 చేరుకున్నా ఆశ్చర్యం లేదు. పెద్ద హీరోల స్థాయిలో దీన్ని రిలీజ్ చేయడానికి అవకాశముంది. మరి ఈ అడ్వాంటేజీని ఉపయోగించుకుని ఏమేరకు ఓపెనింగ్స్ తెచ్చుకుంటుందో ఈ చిత్రం చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English