మంచు విష్ణు.. ది డైరెక్టర్

మంచు విష్ణు.. ది డైరెక్టర్

అవును.. మంచు విష్ణు డైరెక్టర్ అవుతున్నాడు. ఇంకా నటుడిగానే పెద్ద రుజువు చేసుకున్నది లేదు. అంతలోనే డైరెక్టర్ అయిపోవడమేంటి అనిపిస్తోందా? ఐతే అతను ఫుల్ టైం ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్ కావట్లేదులెండి. అతను యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ అవుతున్నాడు. ఒక ప్రభుత్వ ప్రాజెక్టులో భాగంగా విష్ణు ఒక యాడ్ ఫిల్మ్ రూపొందిస్తున్నాడు. దేశంలో నీటి సమస్య రోజు రోజుకూ తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో నీటి వనరుల్ని కాపాడుకోవడంపై జనాల్లో అవగాహన పెంచడం.. నదుల అనుసంధానం ప్రాధాన్యం తెలియజేయడం కోసం మంచు విష్ణు ఒక ప్రకటన రూపొందించడం విశేషం.

ఈ ప్రకటనలో విష్ణు తండ్రి మోహన్ బాబు నటించారు. ఆయన మాటల్లో నీటి వనరుల్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను ఇందులో చూపించారు. రామోజీ ఫిలిం సిటీలో దీని చిత్రీకరణ సాగింది. దీని కాన్సెప్ట్.. డైరెక్షన్ క్రెడిట్ విష్ణుదేనట. సొంత ఖర్చుతో విష్ణు ఈ ప్రకటనను రూపొందించాడు. ఇంకో వారం రోజుల్లో ఈ యాడ్ లాంచ్ అవుతుంది.

దీన్ని జల వనరుల మంత్రిత్వ శాఖకు ఇవ్వనున్నారు. మరి ఈ ప్రకటనను విష్ణు ఎంత ప్రభావవంతంగా రూపొందించాడో.. ఇలా జనాల్లో ఏమేరకు ఆలోచన రేకెత్తిస్తుందో చూడాలి. ఇక విష్ణు కెరీర్ విషయానికి వస్తే.. అతడి కొత్త సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’ విడుదలకు సిద్ధంగా ఉండగా..  ‘ఓటర్’ అనే ద్విభాషా చిత్రంలోనూ అతను నటిస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు