దేవరకొండ ఖాళీ లేకే రావట్లేదట

దేవరకొండ ఖాళీ లేకే రావట్లేదట

ప్రతి హీరో కెరీర్లోనూ అతడికి నచ్చిన సినిమాలు కొన్ని ఉంటాయి. అనుకోని కారణాలతో ఆ సినిమాలు చేయాల్సి వస్తుంది. ఆ సినిమాలు చేస్తుండగా దర్శక నిర్మాతలతో ఏదైనా తేడా రావచ్చు. ఆ సినిమా కెరీర్‌కు ఇబ్బందిగా మారొచ్చు. అలాంటపుడు ఆ సినిమాకు హీరో దూరంగా ఉండిపోతుంటాడు. విజయ్ దేవరకొండ ‘ఏ మంత్రం వేసావె’ అనే సినిమా విషయంలో ఇలాగే చేస్తున్నాడు. తనకు పెద్దగా పేరు లేనపుడు ‘పెళ్లిచూపులు’ కంటే ముందు విజయ్ నటించిన సినిమా ఇది. ఎప్పుడో షూటింగ్ పూర్తయింది కానీ.. అనివార్య కారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు విజయ్‌కి మంచి క్రేజ్ రావడం చూసి రిలీజ్‌కు రెడీ చేశారు.

ఐతే విజయ్ దేవరకొండ ఈ సినిమాను అస్సలు పట్టించుకోవట్లేదు. ప్రమోట్ చేయట్లేదు. మరి విజయ్‌తో సమస్య ఏంటి అని ‘ఏ మంత్రం వేసావె’ సినిమాను రిలీజ్ చేస్తున్న మాల్కాపురం శివకుమార్‌ను అడిగితే.. సమస్య అంటూ ఏమీ లేదన్నాడు. మార్చిలో రిలీజ్ అని తాము సడెన్‌గా అనౌన్స్ చేశామని.. విజయ్‌కి ఈ నెలంతా ఖాళీ లేదని.. బిజీ షెడ్యూళ్ల వల్లే ప్రమోషన్లకు రావట్లేదని అన్నాడు శివకుమార్. ఐతే బయటికొచ్చి ప్రత్యేకంగా ప్రమోషన్లలో పాల్గొనాలని ఏముంది.. సోషల్ మీడియా ద్వారా కూడా తన సినిమాను విజయ్ ప్రమోట్ చేసుకోవచ్చు.

నచ్చి చేశాడో.. నచ్చకుండా చేశాడో.. కానీ సినిమా అయితే చేశాడు. రెమ్యూనరేషన్ కూడా తీసుకుని ఉంటాడు కదా. ఫలితం ఎలా ఉన్నప్పటికీ తన సినిమా రిలీజవుతోందంటూ ఫాలోవర్లకు తన వంతుగా చెప్పాల్సిన బాధ్యత అతడి మీద ఉంది కదా? కానీ అతను పట్టించుకోవట్లేదు. అలాంటపుడు హీరోను ఏమీ అనకుండా సినిమాను రిలీజ్ చేస్తున్న వ్యక్తి వెనకేసుకురావడం విశేషమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు