‘అర్జున్ రెడ్డి’ని వాళ్లు మార్చేస్తారులే..

‘అర్జున్ రెడ్డి’ని వాళ్లు మార్చేస్తారులే..

తెలుగు ప్రేక్షకులతో పోలిస్తే తమిళ ప్రేక్షకుల అభిరుచి వేరుగా ఉంటుంది. మనవాళ్లు విషాదాంతాల్ని అస్సలు ఇష్టపడరు. తమిళ ప్రేక్షకులు అందుకు పూర్తి భిన్నం. విషాదాంతాలే వాళ్లను ఎక్కువ ఆకర్షిస్తాయి. అలాంటి సినిమాలకే పట్టం కడుతుంటారు. ‘ఏమాయ చేసావె’ సినిమాను తమిళంలోనూ ఒకేసారి రూపొందించిన గౌతమ్ మీనన్.. తమిళంలో హీరో హీరోయిన్లు కలవనట్లు చూపించాడు.

తెలుగులో మాత్రం ఇద్దరినీ కలిపేశాడు. గత ఏడాది తెలుగులో సెన్సేషనల్ హిట్టయిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో చాలా భిన్నంగా.. రెవల్యూషనరీగా సాగుతుంది కానీ.. చివరికి వచ్చేసరికి మాత్రం ఆ కథను కూడా సుఖాంతమే చేశారు. తెలుగు ప్రేక్షకుల విషయంలో దర్శకుల భయమది.

కానీ తమిళ ప్రేక్షకుల విషయంలో ఇలాంటి భయాలేమీ ఉండవు కాబట్టి ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘వర్మ’ క్లైమాక్స్ భిన్నంగా ఉండొచ్చని అక్కడి జనాలు భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న బాలా అంటే మామూలుగానే విషాదాంత సినిమాలకు పెట్టింది పేరు. ‘సేతు’.. ‘పితామగన్’.. ఇలా చాలా సినిమాల్ని విషాదంతో ముగించాడు బాలా. ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ విషయంలో తనదైన ముద్ర చూపించడం కోసం క్లైమాక్స్ కచ్చితంగా మార్చే ఉంటాడని అంచనా వేస్తున్నారు. నిజానికి ‘అర్జున్ రెడ్డి’ లాంటి సినిమాను విషాదంతోనే ముగించాలి. ప్రేక్షకుల్ని అంత వరకు సినిమాను రెవల్యూషనరీగా నడిపిస్తూ అన్నింటికీ ప్రిపేర్ చేసిన దర్శకుడు క్లైమాక్స్ విషయంలో మాత్రం రాజీ పడిపోయాడనిపిస్తుంది. మరి దీని రీమేక్ విషయంలో అయినా సరైన న్యాయం జరుగుతుందేమో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు