శిరీష్ వద్దన్నాడు.. మోహన్ లాల్ వచ్చాడు

శిరీష్ వద్దన్నాడు.. మోహన్ లాల్ వచ్చాడు

తెలుగులో ఇంకా నిలదొక్కుకోకముందే మలయాళంలోకి వెళ్లి ‘1971 బియాండ్ బార్డర్స్’ అనే సినిమా చేశాడు అల్లు శిరీష్. ఐతే మోహన్ లాల్ లాంటి లెజెండరీ యాక్టర్‌తో నటించానన్న సంతృప్తి మిగిలిందే తప్ప ఆ సినిమా శిరీష్‌కు మంచి ఫలితాన్నేమీ ఇవ్వలేదు. మలయాళంలో ఈ సినిమా ఫ్లాప్ అయింది. దీంతో తెలుగులో దీన్ని రిలీజ్ చేయడం వల్ల ఫలితమేమీ ఉండదన్న అభిప్రాయంతో విడుదలకు సిద్ధంగా ఉన్న తెలుగు వెర్షన్‌ను ఆపించేశారు.

కానీ ఇప్పుడు ఉన్నట్లుండి ‘యుద్ధభూమి’ అనే పేరు మార్చి ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేశారు. ఐతే ఈ సినిమా తెలుగులో రిలీజ్ కావడానికి శిరీష్‌కు పెద్దగా ఇష్టం లేదన్నట్లుగా వార్తలొచ్చాయి.

ఈ చిత్ర ప్రమోషన్లలో శిరీష్ పాల్గొనకపోవడం ఆ సందేహాలకు బలం చేకూర్చింది. ఐతే శిరీష్ ఈ సినిమాను పట్టించుకోకపోయినా మోహన్ లాల్ తెలుగు ప్రమోషన్‌కు సహకరిస్తుండటం విశేషం. ఈ చిత్ర నిర్మాతలు మోహన్ లాల్‌ను కలిసి ఈ సినిమా గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడించారు. ఇది చాలా మంచి సినిమా అని.. ‘మన్యం పులి’ తరహాలోనే దీన్ని ఆదరించాలని మోహన్ లాల్ తెలుగు ప్రేక్షకుల్ని కోరాడు. ‘మనమంతా’.. ‘జనతా గ్యారేజ్’ లాంటి డైరెక్ట్ తెలుగు సినిమాల్ని అసలేమాత్రం ప్రమోట్ చేయని లాల్.. ‘యుద్ధ భూమి’ లాంటి ఫ్లాప్ మూవీకి ఇలా సహకారం అందించడం విశేషమే. మరి ఈ సినిమా తెలుగులో ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English