సాయిపల్లవిని రజినీతో పోల్చేశారు

సాయిపల్లవిని రజినీతో పోల్చేశారు

ఒక పరభాషా కథానాయిక తెలుగులో నటించిన తొలి సినిమాకే డబ్బింగ్ చెప్పుకోవడం అరుదైన విషయం. పైగా తెలంగాణ స్లాంగ్‌ లో పక్కాగా డైలాగులు చెబుతూ వినోదం పండించడమంటే మామూలు విషయం కాదు. సాయిపల్లవి తొలి సినిమా ‘ఫిదా’తోనే తెలుగు ప్రేక్షకుల్లో తిష్ట వేసుకుని కూర్చోవడానికి అదే కారణం. ఆ సినిమా కోసం ఆమె చూపించిన కమిట్మెంట్ అసాధారణం.

 ఇక ఆ సినిమాకు సంబంధించిన వేడుకల్లో ఎంతో హుందాగా ప్రవర్తిస్తూ.. చక్కగా మాట్లాడుతూ జనాలకు మరింతగా చేరువైంది. ఇప్పుడు తన కొత్త సినిమా ‘కణం’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఆమె చూపించిన కమిట్మెంట్ మరోసారి చర్చనీయాంశమైంది.

ఈ సినిమా ఆడియో వేడుక కోసం సాయిపల్లవి ఎయిర్ పోర్ట్ నుంచి కారులో బయల్దేరగా.. మధ్యలో ట్రాఫిక్ జామ్ అయింది. సాయంత్రం పూట హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ ఎలా ఉంటుందో చెప్పేదేముంది? కార్లో వెళ్తే సమయానికి ఈవెంట్ అందుకోవడం కష్టమని భావించిన సాయిపల్లవి.. తన అసిస్టెంటుతో ఒక బైక్ తెప్పించుకుని దాని మీద ప్రసాద్ ల్యాబ్ కు చేరుకోవడం విశేషం.

ఇలా ఒక పేరున్న హీరోయిన్ మామూలు అమ్మాయిలా బైక్ మీద వెళ్తుండేసరికి చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోయారు. ఈవెంట్ దగ్గర సాయిపల్లవి కోసం ఎదురుచూస్తున్న మీడియా వాళ్లు.. చిత్ర బృందం ఆమె ఇలా బైక్ మీద వచ్చి దిగే సరికి షాకైపోయారు. చకచకా కెమెరాలు క్లిక్ మనిపించారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో నిమిషాల్లో వైరల్ అయిపోయాయి. సింప్లిసిటీ విషయంలో సాయిపల్లవిని కొందరు రజినీకాంత్ తో పోల్చడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు