పొలిటీషియన్లపై రజినీ సెటైర్లు

పొలిటీషియన్లపై రజినీ సెటైర్లు

తన రాజకీయ అరంగేట్రం గురించి రెండు నెలల కిందటే ప్రకటించిన సూపర్ స్టార్ రజినీకాంత్.. ఆ తర్వాత స్తబ్దుగా ఉండిపోయారు. ఏ రాజకీయ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. ఇంకా పార్టీ పేరు, విధివిధానాలు ప్రకటించలేదు. రాజకీయ ప్రసంగాలేవీ చేయలేదు. ఐతే నిన్న చెన్నైలో ఎంజీఆర్ ఎడ్యుకేషనల్ అండ్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్లో ఎంజీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం సూపర్ స్టార్ అరగంటకు పైగా సుదీర్ఘంగా ప్రసంగించారు.

ఇది అచ్చంగా రాజకీయ ప్రసంగమే. తనదైన శైలిలో చెణుకులు విసురుతూ వర్తమాన రాజకీయాలపై తన అభిప్రాయాలు చెబుతూ.. రాజకీయ నేతలపై సెటైర్లు కూడా వేస్తూ.. 5 వేల మందికి పైగా హాజరైన విద్యార్థుల్ని ఉత్సాహ పరుస్తూ రజినీ ప్రసంగం సాగింది.

సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రావడం రాజకీయ నాయకులకు ఇష్టం ఉండదని.. ఐతే తమిళనాడును పాలించిన ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత సినిమా వాళ్లే అని రజినీ అన్నాడు. రాజకీయ నాయకులైన తాము సినిమా రంగంలోకి రావట్లేదు కదా.. సినిమా వాళ్లయిన మీరు రాజకీయ రంగంలోకి ఎందుకొస్తున్నారని పొలిటీషియన్లు చిత్రంగా మాట్లాడుతున్నారని రజినీ అన్నాడు. ప్రస్తుతం తమిళనాట రాజకీయ శూన్యత ఉందని.. ప్రజలు సరైన నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారని రజినీ చెప్పాడు.

తన ప్రసంగం ఆద్యంతం కేరింతలతో ఉత్సాహ పరిచిన విద్యార్థుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘మీరు నాకు ఓటేయండి. కానీ ఇప్పుడే రాజకీయాల్లోకి రాకండి. ముందు మీ చదువు, కెరీర్ మీద దృష్టిసారించండి’’ అని రజినీ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు