అప్పుడు రవితేజ.. ఉదయ్ కిరణ్.. ఇప్పుడు విజయ్

అప్పుడు రవితేజ.. ఉదయ్ కిరణ్.. ఇప్పుడు విజయ్

సినిమా ఇండస్ట్రీలో కాలం కలిసి రానపుడు.. అవకాశాల కోసం ఆవురావురుమని ఉన్నపుడు చేతికొచ్చిన ప్రతి అవకాశాన్నీ ఒప్పేసుకోవడమే. ఐతే అలా ఒప్పుకుని చేసిన సినిమాలు మధ్యలో ఉండగానే వేరే సినిమాలు పేరు తేవడం.. దాంతో రేంజ్ మారిపోవడం.. ఆపై మధ్యలో ఉన్న సినిమాలు లేటుగా విడుదలకు సిద్ధమై వాళ్లకు అడ్డంకిగా తయారవడం మామూలే. గతంలో కొందరు పేరున్న కథానాయకులు ఇలాంటి సినిమాలతో ఇబ్బంది పడ్డవాళ్లే.

సీనియర్ హీరో రవితేజ ‘ఇడియట్’ తర్వాత స్టార్ ఇమేజ్ సంపాదించుకుని మంచి రేంజికి వెళ్లాక అతను అంతకుముందెప్పుడో నటించిన ‘అన్వేషణ’ అనే సినిమా వచ్చి అడ్డం పడింది. అది అతడికి చాలా ఇబ్బందిగా మారింది. ఆ సినిమాను రవితేజ పట్టించుకోలేదు. అది వచ్చింది, వెళ్లింది. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ విషయంలోనూ ఇలాగే జరిగింది. అతను పెద్దగా పేరు లేని టైంలో చేసిన ‘జోడీ నంబర్ వన్’ అనే సినిమా అతడికి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ సినిమాను మధ్యలో వదిలేసినందుకు నిర్మాత అతడిని ఇబ్బంది పెట్టాడు. చివరికి ఆ చిత్రం పూర్తయి విడుదలైంది. ఉదయ్ కూడా దాన్ని పట్టించుకోలేదు.

ఇప్పుడు ‘అర్జున్ రెడ్డి’తో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండకు కూడా ఓ సినిమా ఇబ్బందిగా మారింది. అదే.. ‘ఏ మంత్రం వేసావె’. అతనెప్పుడో చేసిన ఈ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ట్రైలర్ చూస్తే దీని మీద ఏమాత్రం ఆశలు పెట్టుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ చిత్రాన్ని విజయ్ దేవరకొండ అసలేమాత్రం పట్టించుకోవడం లేదు. ఆ చిత్ర నిర్మాత మాత్రం ఈ నెల 9న విడుదలకు సన్నాహాలు చేసుకుంటున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు