శ్రీదేవి చేతుల మీదుగా టీ ఇస్తే..

శ్రీదేవి చేతుల మీదుగా టీ ఇస్తే..

ఎంతటి సెలబ్రెటీలైనా కూడా మామూలు మనుషులే అనే విషయం గుర్తుంచుకోవాలి. వాళ్లు కూడా అందరిలాగే జీవనం సాగిస్తారు. అందరూ చేసే పనులే చేస్తారు. ఐతే తమ ఆరాధ్య నటీనటుల్ని దేవుళ్లలాగా భావించిన అభిమానులు.. వాళ్లు మామూలు పనులు చేస్తుంటే చూసి ఆశ్చర్యపోవడం సహజం.

ఐతే ఇలా సామాన్యులు ఆశ్చర్యపోతే ఓకే కానీ.. ఒక నటి గురించి ఒక ప్రముఖ నిర్మాత ఇలా ఆశ్చర్యపోవడం మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయం. శ్రీదేవి విషయంలో అల్లు అరవింద్ స్పందన ఇలాగే ఉంది మరి. ఆయన కూడా రామ్ గోపాల్ వర్మ స్టయిల్లో శ్రీదేవి గురించి స్పందించడం విశేషం.

హైదరాబాద్ వేదికగా జరిగిన శ్రీదేవి సంస్మరణ సభలో అరవింద్ మాట్లాడుతూ.. శ్రీదేవి ఇంట్లో తనకు ఎదురైన ఒక అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘ఓసారి బోనీ కపూర్ ఇంటికి వెళ్లా. ఓ కుర్రాడు టీ పట్టుకొచ్చాడు. శ్రీదేవి మధ్యలో టీ కప్పు అందుకుని.. నా చేతుల్లో పెడుతుంటే ఆశ్చర్యం కలిగింది. నా మనసులో ఆవిడకున్న స్థాయి వేరు. ఆమె అలా కప్పు అందించడం అంగీకరించలేకపోయా. ఆ విషయం నాతోపాటు వచ్చిన అశ్వినీదత్‌కు చెప్పుకుంటూ చాలాబాధపడ్డా. ఇక శ్రీదేవి మరణం తర్వాత రామ్ గోపాల్ వర్మ రాసిన లేఖ చదివాను. వర్మ గురించి మనం రకరకాలుగా అనుకుంటాం. కానీ ఆయన హృదయం ఎంత మెత్తనైందో నాకు అప్పుడే తెలిసింది’’ అని అరవింద్ అన్నారు.