కీలుగుర్రం చూడలేదంటున్న కీరవాణి

కీలుగుర్రం చూడలేదంటున్న కీరవాణి

తెలుగులో కాపీ ముద్ర వేయించుకోని సంగీత దర్శకులు అరుదు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సైతం కొన్నిసార్లు ఆరోపణలు ఎదుర్కొన్నవారే. ఆయన చేసిన కొన్ని ట్యూన్ల విషయంలో పోలికలు కనిపించాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో ఆయన ఆరోపణలు ఎదుర్కొన్నారు.

ముఖ్యంగా ‘బాహుబలి-2’లోని థీమ్ మ్యూజిక్‌ను కీరవాణి అక్కినేని నాగేశ్వరరావు నటించిన పాత సినిమా ‘కీలుగుర్రం’ నుంచి కాపీ కొట్టాడంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో ఆ మ్యూజిక్ క్లిప్ పట్టుకొచ్చి మరీ సోషల్ మీడియాలో కొందరు కీరవాణిని టార్గెట్ చేసుకున్నారు. మరి ఈ విషయంలో కీరవాణి స్పందన కోరితే ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

తాను అసలు ‘కీలుగుర్రం’ సినిమానే చూడలేదని.. యాదృచ్ఛికంగానే ఆ సినిమాలోని మ్యూజిక్ ‘బాహుబలి-2’లో వినిపించి ఉండొచ్చని ఆయన అన్నారు. ఐతే ఆ ఛాయలు తన సినిమాలో కనిపించినందుకు తనకు సంతోషమే అని కీరవాణి అన్నాడు. కొన్నిసార్లు దర్శకుడి కోరిక మేరకు కొన్ని రకాల సంగీతాన్ని అనుకరించాల్సి వస్తుందని కీరవాణి చెప్పాడు.

ఇక ఫలానా సినిమా నుంచి ఈ బిట్ తీసుకుని వాడండి అని ఒక దర్శకుడు మీకు సూచన ఇస్తే దాన్ని అంగీకరిస్తారా అని కీరవాణిని అడిగితే.. చాలా కాలం పాటు తాను నో చెప్పే పరిస్థితిలో లేనని.. కొన్నిసార్లు అనుకరించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడిందని.. కానీ ఇప్పుడు తాను అలాంటి స్థితిలో లేనని.. దర్శకుడు అలా చెబితే తిరస్కరిస్తానని ఆయన ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు