కిరాక్ పార్టీ.. వస్తున్నట్లేనా?

కిరాక్ పార్టీ.. వస్తున్నట్లేనా?

నిఖిల్ కొత్త సినిమా ‘కిరాక్ పార్టీ’ ఫిబ్రవరి 9నే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ  ఆ సమయానికి సినిమాను రిలీజ్ చేయలేకపోయారు. తర్వాతి రెండు వారాలకు కూడా సినిమాను సిద్ధం చేయలేకపోయారు. ఇంతలోనే స్ట్రైక్ మొదలైంది. దీంతో సినిమాను మార్చి ద్వితీయార్ధానికి వాయిదా వేశారు. ముందు మార్చి 23న అనుకుని.. ఆ తర్వాత 16కు ప్రి పోన్ చేశారు. రిలీజ్ డేట్ పోస్టర్లు కూడా వేశారు. ప్రమోషన్లు కూడా చేస్తున్నారు.

కానీ ఆ రోజుకు సినిమా రిలీజవుతుందో లేదో అన్నదానిపై స్పష్టత మాత్రం లేదు. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు (డీఎస్పీలు) దిగి వచ్చి రేట్లు తగ్గిస్తారనే ఉద్దేశంలో నిర్మాతలు ఉండగా.. అన్ సీజన్ కాబట్టే నిర్మాతలు స్ట్రైక్ చేస్తున్నారని.. తర్వాత వాళ్లే కాళ్ల బేరానికి వస్తారనే అభిప్రాయంలో డీఎస్పీలు ఉన్నారు. సమ్మె మొదలై రెండు రోజులు గడుస్తున్నా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇరు వైపుల నుంచి ఎలాంటి స్పందన లేదు. మరి ఎవరు తగ్గుతారో.. ఎప్పుడు తగ్గుతారో.. చర్చలతో సమస్య పరిష్కారమై థియేటర్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో తెలియట్లేదు.

ప్రస్తుతానికైతే వచ్చే వారం కూడా కొత్త సినిమాలేమీ రిలీజయ్యే అవకాశాలు కనిపించడం లేదు. 9వ తేదీకి షెడ్యూల్ అయిన విజయ్ దేవరకొండ సినిమా ‘ఏ మంత్రం వేసావె’ను వాయిదా వేసుకోవాల్సిందే. ఐతే ఆ సినిమాపై ఏ అంచనాల్లేవు కాబట్టి ఓకే. ఇబ్బందంతా ‘కిరాక్ పార్టీ’కే. ఈ సమ్మె దెబ్బతో ముందు స్ట్రగులయ్యేది ఆ సినిమానే. ఈ డేట్ వదిలేస్తే ఇంకో రెండు నెలలకు పైగా ఖాళీ దొరికే అవకాశం లేదు.

ఇప్పుడు ప్రమోషన్లు, పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టుకుని.. సినిమా అనుకున్న ప్రకారం రిలీజ్ కాకుంటే నిర్మాతకు దాని వల్లా నష్టం తప్పదు. ఇప్పటికే సినిమా ఆలస్యం కావడం వల్ల కొంత నష్టం తప్పట్లేదు. మరి సమ్మె విరమణ సంగతి ఎప్పుడు తేలుతుందో.. థియేటర్లు మళ్లీ ఎప్పుడు తెరుచుకుంటాయో.. ‘కిరాక్ పార్టీ’ అనుకున్న ప్రకారం విడుదలవుతుందో లేదో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English