శ్రీదేవి ప్రాణం పోతున్నపుడు ఆయన క్రికెట్ చూస్తూ..

శ్రీదేవి ప్రాణం పోతున్నపుడు ఆయన క్రికెట్ చూస్తూ..

శ్రీదేవి మరణించి వారం దాటింది. ఇంకా ఆమె మరణానికి సరైన కారణం ఏంటనే విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. ముందు గుండెపోటు అన్నారు. తర్వాతేమో ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోయి చనిపోయిందన్నారు. కానీ ఆమె నీటిలో ఎందుకు మునిగిపోయారనే విషయంలో స్పష్టత లేదు. ఇక శ్రీదేవి చనిపోవడానికి ముందు అసలేం జరిగిందనే విషయంలో రకరకాల ఊహాగానాలున్నాయి. ఈ విషయంలో భర్త బోనీ కపూర్ ఏం చెబుతారా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దీనిపై ఎట్టకేలకు బోనీ నోరు విప్పారు. కోమల్ నెహతా అనే ట్రేడ్ అనలిస్టుకు ఆయన అసలేం జరిగిందో వివరించారు.

దీని ప్రకారం శ్రీదేవి ప్రాణం పోతున్న సమయంలో బోనీ కపూర్ క్రికెట్ చూస్తూ ఉన్నారట. ఐతే బాత్రూం లోపల ఏం జరుగుతోందన్నది పాపం బోనీకి తెలియదు. ఆ ఫిబ్రవరి 20న దుబాయిలో పెళ్లి ముగించుకుని మరుసటి రోజు లక్నోలో ఒక మీటింగ్ ఉండటంతో బోనీ కపూర్ ఇండియాకు వచ్చేశారు. 22.. 23 తేదీల్లో శ్రీదేవి దుబాయి హోటల్లో ఒక్కతే ఉంది. అలా విదేశాల్లో శ్రీదేవి ఎప్పుడూ ఒంటరిగా ఉన్నది లేదు. అంతకుముందు పెళ్లయిన తర్వాత కేవలం రెండు సందర్భాల్లో మాత్రమే.. అది కూడా సినిమా షూటింగుల కోసం ఆమె భర్త లేకుండా విదేశాల్లో ఉంది. కూతురు జాన్వి కోసం షాపింగ్ చేయడానికి శ్రీదేవి ఒక్కతే అక్కడ ఉంది. దీంతో బోనీ తిరిగి దుబాయ్ వెళ్లాలనుకున్నాడు. ఆమెను సర్ప్రైజ్ చేయడం కోసం ముందుగా విషయం చెప్పలేదు. 24న సాయంత్రం బోనీ వెళ్లగానే శ్రీదేవి షాకైంది. తర్వాత ఇద్దరూ డిన్నర్ కోసం బయటికి వెళ్లాలనుకున్నారు. శ్రీదేవి లివింగ్ రూంలో ఉన్న మెయిన్ బాత్రూంలో స్నానానికి వెళ్లింది. బోనీ కపూర్ టీవీ చూస్తూ కూర్చున్నారు.

ఇండియా-దక్షిణాఫ్రికా మ్యాచ్ టీ20తో పాటు పాకిస్థాన్ సూపర్ లీగ్ హైలైట్లు కూడా చూశారు. ఐతే 15 నిమిషాలు దాటినా శ్రీదేవి బాత్రూం నుంచి బయటికి రాకపోవడంతో బోనీ కేకలేశారు. స్పందన లేదు. టీవీ సౌండ్ తగ్గించి అరిచినా రెస్పాన్స్ లేదు. దీంతో ఆయన భయపడ్డారు. బలవంతంగా తలుపు తెరిచే ప్రయత్నం చేశారు. లోపలి నుంచి గొళ్లెం పెట్టి ఉంది. ఇక అతి కష్టం మీద తలుపు పగలగొట్టి లోపలికి వెళ్తే.. శ్రీదేవి అచేతనంగా.. నీటిలో మునిగిపోయి కనిపించారు. ఆమె నీటిలో మునిగిపోతూ పెనుగులాడే ప్రయత్నం కూడా ఏమీ చేసినట్లు లేదట. అలా చేస్తే నీళ్లు పైకి ఒలికి ఉండేవి. అలాంటిదేమీ జరిగినట్లు కనిపించలేదు. శ్రీదేవిని ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. ఇదీ బోనీ కపూర్ వెర్షన్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు