ఒక కీరవాణి.. నాలుగు ‘రా’లు

ఒక కీరవాణి.. నాలుగు ‘రా’లు

తనకు ‘రా’ అనే అక్షరంతో ఎంతో అనుబంధం ఉందని.. ఆ అక్షరం తనకెంతగానో కలిసొచ్చిందని అంటున్నాడు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి. సంగీత దర్శకుడిగా తన కెరీర్లో అత్యంత కీలకంగా వ్యవహరించిన నలుగురు వ్యక్తుల పేర్లు ‘రా’తోనే మొదలవుతాయని కీరవాణి చెప్పారు. అందులో ముందుగా ఆయన రామోజీ రావు గురించి చెప్పారు.

ఆయన ‘మనసు మమత’ సినిమాతో తనకు సంగీత దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చారని.. ఆ సినిమాలో తన పనితనం నచ్చి తర్వాత తమ బేనర్లో ప్రతి సినిమాకూ పని చేయమని చెప్పారని.. ‘పీపుల్స్ ఎన్‌కౌంటర్’, ‘అమ్మ’, ‘అశ్విని’.. ఇలా వరుసగా సినిమా చేశానని అన్నారు కీరవాణి.

ఇక రెండో ‘రా’ గురించి చెబుతూ.. రామ్ గోపాల్ వర్మను లైన్లోకి తెచ్చాడు కీరవాణి. ‘శివ’ లాంటి సెన్సేషనల్ మూవీ తర్వాత వర్మ క్రేజ్ పీక్స్‌కు చేరిందని.. ఐతే ఇళయరాజా లాంటి దిగ్గజాన్ని కాదని తెలుగులో తన రెండో సినిమా ‘క్షణ క్షణం’కు తనను సంగీత దర్శకుడిగా పెట్టుకున్నాని.. వర్మ సినిమాకు పని చేస్తున్నానన్న కారణంతో ఆ సినిమా విడుదల కాకముందే తనకు బోలెడన్ని అవకాశాలు దక్కాయని కీరవాణి చెప్పాడు. వర్మ వల్ల తాను సినీ పరిశ్రమలో స్థిరపడగా.. రాఘవేంద్రరావుతో జత కట్టాక స్టార్ స్టేటస్ సంపాదించానని.. ఆయనతో 27 సినిమాలు చేస్తే అన్నీ మ్యూజికల్ హిట్లే అని.. అందులో 20 సినిమాలు బాగా ఆడాయని అన్నాడు.

చివరి ‘రా’ అంటే మరెవరో కాదు.. రాజమౌళి అట. ‘స్టూడెంట్ నం.1’ నుంచి ‘బాహుబలి’ వరకు తమ ప్రయాణం అద్భుతంగా సాగుతూ వస్తోందని కీరవాణి చెప్పాడు. ఇలా ఈ నాలుగు ‘రా’లూ తన జీవితంలో కీలకం అని చెప్పిన కీరవాణి.. వ్యక్తులుగా కాకుండా ‘రాగాలు’లోని రా కూడా తన జీవితంలో ముఖ్యమైందే అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు