శ్రీ‌దేవి మ‌ర‌ణంపై బోనీ క‌పూర్ వెర్ష‌న్ ఇదే!

శ్రీ‌దేవి మ‌ర‌ణంపై బోనీ క‌పూర్ వెర్ష‌న్ ఇదే!

గ‌త నెల 24న `అతిలోక సుంద‌రి`, ప్రముఖ సినీ నటి శ్రీదేవి హఠాన్మరణం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. శ్రీ‌దేవి మ‌ర‌ణం పై ప‌లు అనుమానాలు వ్య‌క్తం కాగా.....చివ‌ర‌కు ఆమె బాత్ ట‌బ్ లో మునిగి చ‌నిపోయిన‌ట్లు దుబాయ్ అధికారులు ఫోరెన్సిక్ నివేదిక‌లో వెల్ల‌డించింది. ఆమెది స‌హ‌జ మ‌ర‌ణం కాదని.....బాత్ ట‌బ్ లో మునిగి చ‌నిపోవ‌డం ఎలా సాధ్య‌మ‌ని ....తెలుగు మీడియాతో పాటు....ప‌లు జాతీయ అంత‌ర్జాతీయ మీడియాల్లో `తొట్టిలో రిపోర్టింగ్` చేసిన సంగ‌తి తెలిసిందే.

దుబాయ్ అధికారులు....బోనీ క‌పూర్ , అర్జున్ క‌పూర్ ల‌ను విచార‌ణ చేశార‌ని....శ్రీ‌దేవిది స‌హ‌జ మ‌ర‌ణ‌మేన‌ని `మీడియా` డిక్టేర్ చేసింద‌ని సోష‌ల్ మీడియాలో తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. ఇంత జ‌రుగుతున్నా శ్రీ‌దేవి మ‌ర‌ణం గురించి బోనీ క‌పూర్ ఇప్ప‌టి వ‌ర‌కు పెద‌వి విప్ప‌లేదు. తాజాగా, శ్రీదేవి మరణించిన రోజు జ‌రిగిన ఘ‌ట‌న‌ల గురించి త‌న స్నేహితుడి వద్ద బోనీ క‌పూర్ ప్ర‌స్తావించిన వార్త ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఫిబ్ర‌వ‌రి 24 సాయంత్రం జరిగిన విష‌యాల‌ను  తన స్నేహితుడు, ట్రేడ్‌ ఎనలిస్ట్‌ కోమల్‌ నాహ్తాకు బోనీ క‌పూర్ వివరించార‌ట‌. బుధవారం శ్రీదేవి అంత్యక్రియలకు ముందు వారిద్దరి మధ్య జరిగిన సంభాష‌ణ‌ను నాహ్తా తన ట్విటర్‌ పేజీలో షేర్‌ చేశారు. బోనీ క‌పూర్, నాహ్తాల సంభాష‌ణ ట్వీట్ య‌థాత‌ధంగా.......

"ఫిబ్రవరి 24వ తేదీన ఉదయం నేను శ్రీదేవితో మాట్లాడాను. సాయంత్రం నేను దుబాయ్‌ కి వస్తున్నట్టు ఆమెకు చెప్పనేలేదు. నేను దుబాయ్‌ కి వెళ్లాలన్న ఆలోచనకు జాన్వీ ఓకే చెప్పింది కూడా. శ్రీదేవి ఒంటరిగా ఉంటే భయపడుతుందని, పాస్‌ పోర్ట్ తదితరాలను ఎక్కడైనా పెట్టి మరచి పోతుందన్నది జాన్వీ భయం. గడచిన 24 సంవత్సరాల్లో నేను, శ్రీదేవి కలసి విదేశాలకు కేవలం రెండుసార్లు మాత్రమే వెళ్లాము. న్యూజెర్సీ, వాంకోవర్‌ లకు శ్రీదేవి వెళ్లినప్పుడు కూడా నేను వెళ్లలేదు. అప్పుడు ఓ స్నేహితుడిని తోడుగా పంపాను.

రెండు రోజులు శ్రీదేవి ఒంటరిగా విదేశాల్లో ఉండటం దుబాయ్ లోనే జరిగింది. ఫిబ్రవరి 20న ఓ వివాహం నిమిత్తం నేను, శ్రీదేవి, ఖుషీ దుబాయ్‌ వెళ్లాం. 22న లక్నోలో ఓ సమావేశం ఉండటంతో దానికి హాజరయ్యేందుకు నేను వెనక్కు వచ్చాను. 22, 23వ తేదీల్లో జుమేరా ఎమిరేట్స్‌ టవర్‌ హోటల్‌ లోని 2201 నంబర్ రూములో బసచేసిన శ్రీదేవి, జాన్వీ కోసం షాపింగ్‌ చేసింది. ఆమెకు సర్ ప్రైజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో  ఫిబ్రవరి 24న మధ్యాహ్నం నేను బయలుదేరాను. దుబాయ్‌ కాలమానం ప్రకారం సాయంత్రం 6.20 గంటలకు శ్రీదేవి దగ్గరికి వెళ్లాను.

నన్ను చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఓ పావుగంట మాట్లాడుకున్న తరువాత ఫ్రెషప్ అయి, రొమాంటిక్‌ డిన్నర్‌కు వెళదామని చెప్పాను. దానికి శ్రీదేవి ఓకే చెప్పి, స్నానం చేసేందుకు బాత్ రూముకు వెళ్లింది. నేను కాసేపు టీవీ చూస్తూ గడిపాను. 8 గంటలైనా ఆమె బయటకు రాకపోవడంతో, హోటల్ లో రద్దీ పెరుగుతుందన్న ఉద్దేశంతో నేనే రెండుసార్లు పెద్దగా పిలిచినా స్పందన లేదు. ఆపై డోర్ తట్టినా సమాధానం లేదు. లోపల ట్యాప్ ఆన్ చేసినట్టు శబ్దం వినిపించింది. ఎటువంటి మాటలూ రాకపోవడంతో ఆందోళనతో డోర్ తెరిచే ప్రయత్నం చేశాను. లోపలివైపున బోల్ట్ పెట్టక పోవడంతో వెంటనే డోర్ తెరచుకుంది. లోపల బాత్ టబ్ లోని నీటిలో చలనం లేకుండా శ్రీదేవి కనిపించింది. దీంతో ఒక్కసారిగా భూమి బద్దలైపోయినట్లయింది" అని బోనీ కపూర్ త‌న‌కు చెప్పిన‌ట్లు నాహ్తా ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. అయితే, శ్రీ‌దేవి మ‌ర‌ణంపై బోనీ క‌పూర్ స్వ‌యంగా ఇప్ప‌టివ‌ర‌కు ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

త‌న‌తో బోనీ క‌పూర్ చెప్పిన విషయాలను నాహ్తా విశ్లేషించారు. శ్రీదేవి....బాత్ టబ్ లో పడుకుని నిద్రపోయి...అలాగే నీట మునిగి ఉండవచ్చని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. నీట మునిగిన వెంట‌నే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లి ఉంటుందని అన్నారు. బాత్ టబ్ నిండా నీరున్న‌ప్ప‌టికీ చుక్క నీరు కింద పడలేదని.....బ‌హుశా బాత్ టబ్ లో ఆమె చేతులు లేదా కాళ్లు ఆడించటం వంటివి చేయలేదని అన్నారు. శ్రీదేవిని ఒక్క క్షణం కూడా బాధ పెట్టకుండా ప్రాణం పోయినట్టు తనకు అనిపించిందన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు