ప్రభుత్వానికి ఆ అవసరం ఏమొచ్చిందబ్బా ?

ఇపుడిదే విషయం ఎవరికీ అర్ధం కావటంలేదు. దశాబ్దాలుగా ఉన్న తెలుగు అకాడమీని తెలుగు-సంస్కృత అకాడమిగా పేరు మార్చేసింది ప్రభుత్వం. అకాడమి పేరును హఠాత్తుగా మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందో ప్రభుత్వం వివరణ ఇవ్వలేదు. పైగా అకాడమిలో తెలుగుతో ఏమాత్రం సంబంధం లేని వారిని పాలకమండలి సభ్యులుగా నియమించటం మరీ విచిత్రంగా ఉంది.

తెలుగు-సంస్కృత అకాడమిగా పేరు మార్చారు కాబట్టి సంస్కృత భాషలో ప్రవేశం ఉన్న వాళ్ళని పాలకమండిలిలో సభ్యులుగా వేశారు బాగానే ఉంది. మరి ఏమి సంబంధం ఉందని కెమిస్ట్రీ రిటైర్డ్ ప్రొఫెసర్ భాస్కర్ రెడ్డి, కౌన్సిలర్ రాజకుమార్ నేరెళ్ళ, బీఈడీ కాలేజీ లెక్షిరర్ కప్పగంతు రామకృష్ణను నియమించిందో ప్రభుత్వానికే తెలియాలి.

తెలుగు అకాడమి పాలకమండలిలో ఛైర్మన్ గా కానీ లేకపోతే పాలకమండలిలో సభ్యులుగా తెలుగు భాషాభివృద్ధి కోసం కృషి చేసిన, చేస్తున్న వారిని సభ్యులుగా వేయాలే కానీ ఎవరిని బడితే వారిని వేయకూడదు. ఆమాట కొస్తే తెలుగు భాషాభివృద్ధి కోసం ఛైర్ పర్సన్ గా ఉన్న లక్ష్మీపార్వతి చేసిన సేవలు, కృషి ఏమిటో కూడా చాలామందికి తెలీదు.

స్కూళ్ళల్లోనే తెలుగు మీడియంను ఎత్తేయాలని ఒకవైపు ప్రయత్నాలు చేస్తు మరోవైపు తెలుగు అకాడమికి నిధులివ్వకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. ఇది చాలదన్నట్లు ఇపుడు ఏకంగా పేరునే మార్చేసింది. ఇటువంటి చర్యల వల్ల ప్రభుత్వానికి కానీ అకాడమికి కానీ జరిగే మంచి ఏమిటో ? వచ్చే పేరేమిటో అర్ధం కావటంలేదు.